సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రానికి చెందిన పల్లె కైలాస్ మూడు ఎకరాల విస్తీర్ణంలో రూ.18 వేల పెట్టుబడితో మొక్కజొన్న సాగుచేశారు. వర్షాభావంతో రెండు నెలల పైరులో ఎదుగుదల నిల్చిపోయింది. మూడు రోజులుగా ఎండలు ముదరడంతో ప్రస్తుతం ఎండిపోతోందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
వరుణుడు ముఖం చాటేశాడు. జులై మూడోవారం దాకా జోరు వానలతో భయపెట్టిన మేఘాలు ఇప్పుడు మచ్చుకైనా కన్పించడం లేదు. దీనికితోడు ఎండలు ముదిరి పొడి వాతావరణం ఏర్పడటంతో పలు ప్రాంతాల్లో పైర్లు నిలువునా వాడిపోతున్నాయి. బెట్ట పరిస్థితులతో ముఖ్యంగా కంది, పత్తి, సోయాచిక్కుడు, మొక్కజొన్న తదితర పంటలు వాడుతున్నట్లు జయశంకర్ వర్శిటీ శాస్త్రవేత్తల పరిశీలనలో వెల్లడైంది. మరో ఐదారు రోజుల్లో వానలు పడకపోతే వర్షాధారంగా సాగైన సుమారు 20 లక్షల ఎకరాల్లో పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అప్పుడు జోరు..ఇప్పుడు అసలే లేవు
ఈ ఏడు జూన్‌లోనే వర్షాలు మొదలవడంతో పంటలు జోరందుకున్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటికే కోటి ఎకరాలకుపైగా పంటలు సాగయ్యాయి. ఇంకా పండ్లు, కూరగాయలు వంటివి మరో 10 లక్షల ఎకరాల్లో ఉన్నాయి. తర్వాతే పరిస్థితులు మారాయి. గత జూన్ 1 నుంచి బుధవారం వరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 449 మిల్లీమీటర్లకన్నా 28 శాతం ఎక్కువ కురిసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆ వర్షాలన్నీ గత రెండు నెలల్లో కొన్ని రోజుల్లో కురిసినవే కావడం గమనార్హం. జులై ఆఖరు నుంచి ఇప్పటిదాకా కొన్ని మండలాల్లో చినుకు జాడే లేదు. ఉదాహరణకు భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో 40 శాతం, సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో సాధారణంకన్నా 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంకన్నా 19 శాతానికి మించి లోటు ఏర్పడితే ఆ ప్రాంతాల్లో వర్షాభావం తీవ్రంగా ఉన్నట్లుగా వాతావరణశాఖ పరిగణిస్తుంది. ఇలా 19 శాతానికి మించి లోటు ఉన్న మండలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో పంటలు వాడుముఖం పట్టాయి. సగటు వర్షపాతంలో 20 నుంచి 40 శాతం వరకూ లోటు ఉన్న ప్రాంతాల్లో పంటల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీనికి తోడు గత 15 రోజులుగా ఉష్ణోగ్రతలు, పొడి వాతావరణం, ఉక్కపోతలు పెరగడంతో బెట్ట వాతావరణం ఏర్పడి తెగుళ్లు, ఇతర చీడపీడలు పెరిగి పైర్లు దెబ్బతింటున్నట్టు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
* ఉష్ణోగ్రత సాధారణంకన్నా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగితేనే పైర్లపై ప్రభావం పడుతుంది. బుధవారం నల్గొండలో 37.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా 5.1 డిగ్రీలు అధికమని వాతావరణశాఖ తెలిపింది.
పెరిగిన కరెంటు వినియోగం
రాష్ట్రంలో 24 లక్షలకుపైగా వ్యవసాయ బోర్లకింద పంటలను రైతులు సాగుచేశారు. వీటికింద ఎక్కువగా వరినాట్లు వేస్తున్నందున నిరంతరం వాటిని నడుపుతుండటంతో కరెంటు వినియోగం ఈ నెల 8న 12,816 మెగావాట్లకు చేరింది. వర్షాలు లేకపోతే విద్యుత్తు వినియోగం మరింత పెరుగుతుందని అంచనా.