Couple Murdere at Birkur :కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్‌లో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఇంట్లో ఉన్న దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రైతునగర్‌కు చెందిన నారాయణ గుప్తా-సులోచనాదేవీ దంపతులు కిరాణా దుకాణం నడుపుతున్నారు. దంపతులు స్థానికంగా వడ్డీకి అప్పులిస్తుంటారు. రాత్రి భార్యాభర్తలు నిద్రిస్తుండగా... గుర్తుతెలియని వ్యక్తులు నిచ్చెన ద్వారా వెనుక నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. పడక గదిలో ఉన్న నారాయణపై దాడి చేసి, దారుణంగా హత్యచేశారు. సులోచనకు ఉరేసి చంపేశారు.
Couple Murder in Kamareddy :ఉదయం తొమ్మిది దాటినా ఆ ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారికి అనుమానం వచ్చింది. ఏమైందోనని తలుపు కొట్టారు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే నారాయణ రక్తపు మడుగులో పడి నిర్జీవంగా కనిపించాడు. సులోచనాదేవీకి ఉరి వేసుకుని కనిపించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు షురూ చేశారు. ముందుగా దంపతుల గురించి స్థానికంగా ఆరా తీశారు. నారాయణ-సులోచన దంపతులకు పిల్లలు కూడా లేకపోగా... కిరాణ దుకాణం, వడ్డీలకు డబ్బులిస్తూ జీవిస్తున్నారు. డబ్బుల కోసమే వీరిని ఎవరైనా హత్య చేశారా... అనే కోణంలో విచారణ సాగుతోందని పోలీసులు తెలిపారు.