కామారెడ్డి పురపాలక సంఘం నూతన బృహత్ ప్రణాళికపై రైతుల ఆందోళన దృష్ట్యా ఆ జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ ముసాయిదాపై స్పష్టతనిచ్చారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్ కాలేదని ఆయన వెల్లడించారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామన్న ఆయన.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఈ క్రమంలోనే రైతుల భూములు పోతాయన్నది తప్పుడు సమాచారమే అని కలెక్టర్ పేర్కొన్నారు. నిబంధనల ప్రకారమే కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించామని తెలిపారు. మాస్టర్ ప్లాన్‌పై ఇప్పటి వరకు 1,026 అభ్యర్థనలు వచ్చాయని.. జోన్ ప్రకటించినంత మాత్రాన భూసేకరణ జరగదని చెప్పారు. ఇంకా అనేక ప్రక్రియలు ఉన్నాయని.. ఇండస్ట్రియల్ జోన్‌లో ఉన్నందువల్ల భూములు పోతాయని అన్నదాతలు భయపడొద్దని సూచించారు.
దీనిపై ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చని ఇప్పటికే ప్రకటించామన్న కలెక్టర్.. అభ్యర్థనల స్వీకరణకు ఈ నెల 11 వరకు సమయం ఉందని స్పష్టం చేశారు. రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూములు పోతాయని కొందరు పదే పదే చెబుతూ రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆయన.. ఆందోళనల పేరిట ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.