అందరిలాగే హాయిగా సాగుతున్న తన బాల్యాన్ని విధి తలకిందులు చేసింది. చిన్నతనంలోనే అమ్మ-నాన్నలను చంపేసి... వారి ప్రేమను దూరం చేసింది. ఎన్నో కష్ట, నష్టాలకు ఓర్చి, తోచిన పని చేసుకుంటూ... అన్నయ్య, ఊరివారి సహకారంతో చదువును కొనసాగించాడు సంతోష్. పట్టుదలతో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీటు సంపాందించి, వృక్షశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తి చేశాడు. అనంతరం బాన్సువాడలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వృక్షశాస్త్రం బోధిస్తూ... తన కుటుంబానికి ఆసరాగా నిలవసాగడు. బాగా చదువుకోవటం, సమాజం పట్ల అవగాహన ఉండటం వల్ల కుటుంబ నిర్ణయాల్లో ఇంటి పెద్దలా మారాడు. ఒక్కగానొక్క చెల్లికి మంచి సంబంధం చూశారు. త్వరలోనే చెల్లికి పెళ్లి చేసి... కట్న కానుకలతో అత్తారింటికి పంపే సమయానికి... విధి... దురదృష్టం రూపంలో మరోసారి ఆ కుటుంబాన్ని పలకరించింది.
ఇది కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెలుట్ల పేట గ్రామానికి చెందిన సంతోష్ గౌడ్(28) అనే యువకుడి కథ... కాదు వ్యథ. ఫీట్స్, జ్వరం, షుగర్ వ్యాధి, కామెర్లు ఒకేసారి దాడి చేసి... కాలేయాన్ని కొంచెం కొంచెంగా నాశనం చేయసాగాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ సురారంలోని మల్లారెడ్డి ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. తన చెల్లి పెళ్లి కోసమని కూడబెట్టిన సొమ్ము, గ్రామస్థుల చందాలతో పోగైన డబ్బులతో గత నాలుగు రోజులుగా వైద్యం చేయిస్తున్నారు. అయినప్పటికీ వ్యాధి నుంచి ఇంకా కుదుటపడలేదు. ప్రస్తుతం బతకడానికి, చావుతో పోరాడుతున్నాడు. తల్లిదండ్రులు లేరనే బాధ తెలియకుండా పెంచిన తన అన్నయ్యకు... డబ్బులు లేక చికిత్స ఎలా చేయించాలో తెలియని ఆ చెల్లి అయోమయ పరిస్థితిలో కూరుకుపోయింది. అన్నయ్య సంతోష్‌ను మృత్యుకుహరం నుంచి కాపాడుకునేందుకు వేయి కళ్లతో ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది.