జోగులాంబ గద్వాల జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఐజ మండలం దేవబండ గ్రామానికి వెళ్లే దారిలో వాగుపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. అధికంగా కురిసిన వర్షాలకు దేవబండ గ్రామ సమీపంలోని వాగు ప్రవహిస్తోంది. దీంతో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి.
నిండు గర్భిణీని వాగు దాటించిన గ్రామస్థులు - గద్వాల జిల్లా తాజా వార్తలు
ఆ గ్రామంలో సరైన రోడ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు వర్షాలు కురవడం వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇలాంటి సమయంలో ఓ నిండు గర్భిణీని ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటించారు గ్రామస్థులు. ఆ గర్భిణీ పండంటి ఆడ శిశువును ప్రసవించింది.
అకస్మాత్తుగా దేవబండ గ్రామానికి చెందిన గర్భిణీకి నొప్పులు రావడం వల్ల ఆమెను ఎత్తుకొని ప్రవహిస్తోన్న వాగు దాటవలసిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితిలో వాగు దాటించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించగా పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. పగలు కాబట్టి వాగు దాటించారు.. అదే రాత్రి సమయాల్లో అయితే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు గుర్తించి రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చదవండి:దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు నరకయాతన పడ్డ గర్భిణి