జోగులాంబ గద్వాల్ జిల్లా చింతల్ కుంట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోన్న శ్రీజ వినూత్న ఆలోచనతో అబ్బురపరచింది. మొక్కల నిల్వ, సరఫరాకు విస్తృతంగా వినియోగించే ప్లాస్టిక్ కవర్లకు(solution for plastic covers) పరిష్కారం కనుగొనాలని తపించింది. ఈ సమస్యను అధిగమించేందుకు భూమిలో కలిసిపోయే ముడిపదార్ధాలతో కుండ తయారు చేయాలని భావించింది. ఇదే ఆలోచనను ఉపాధ్యాయుడు అగస్టీన్తో చెప్పగా.. వీరిద్దరూ కలిసి ఈ బయోపాట్కు రూపకల్పన చేశారు. వారి గ్రామంలో విస్తృతంగా లభించే వ్యవసాయ వ్యర్థాలు, వేరుశనగ పొట్టునే ముడిపదార్ధంగా తయారు చేసి.. భూమిలో కలిసిపోయే కుండలను రూపొందించారు. ఈ పరిష్కారంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(TSIC) ఏటా నిర్వహించే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో ఉత్తమ పరిష్కారంగా నిలిచింది.
పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు
రాష్ట్ర వ్యాప్తంగా పలువురి దృష్టిని ఆకర్షించిన ఈ ఇన్నోవేషన్ మరింత ముందుకు తీసుకెళ్లేందుకు టీఎస్ఐసీ ప్రతినిధులు శ్రీజను టీవర్క్స్కు(T works) పరిచయం చేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైప్ కేంద్రంగా పేరున్న టీవర్క్స్ బృందం సందర్శించి.. విద్యార్థిని శ్రీజ ఆలోచనకు కొన్ని మార్పులు చేసి బయోప్రెస్( student invented bio pots equipment) అనే ప్రత్యేక పరికరాన్ని రూపొందించి అందించింది. పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఈ ఆలోచనను మెచ్చిన జీఈ అప్లియన్సెస్ కంపెనీ శ్రీజకు.. దీన్ని ఒక పరిశ్రమగా మలుచుకునేందుకు కావాల్సిన సామగ్రిని అందజేసింది. వాటి ద్వారా శ్రీజ ఈ బయోపాట్స్ను పెద్దఎత్తున ఉత్పత్తి చేసే వీలుకలిగింది. ఇలా ఒక సమస్యకు పరిష్కారం కోసం బయోడీగ్రేడబుల్ పాట్ను రూపొందించిన శ్రీజ పదో తరగతి పూర్తి కాకముందే తన సొంతజిల్లాలో శ్రీజ గ్రీన్ గెలాక్సీ పేరుతో పరిశ్రమ ఏర్పాటు దిశగా ఎదగటం తోటి విద్యార్థి లోకానికి ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడ్డారు.