జోగులాంబ గద్వాల జిల్లాలో కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియ మరింత ప్రణాళిక బద్ధంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతకుమారితో కలిసి ఆయన బుధవారం గద్వాలలోని కంటైన్మెంట్ ప్రాంతాలైన వేదనగర్, మొమిన్ మోహల్లాలో పర్యటించారు.
కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారి రోనాల్డ్ రోస్, ఐజీ శివశంకర్, జిల్లా కలెక్టర్ శృతి ఓజా, జిల్లా ఇంఛార్జి ఎస్పీ అపూర్వరావు, ఇతర అధికారులతో కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వెంటనే అతను ఎవరెవరిని కలిశారు.. ఎక్కడెక్కడ తిరిగారనే అంశాల ఆధారంగా వ్యక్తులను గుర్తించాలని సీఎస్ ఆదేశించారు. వారందరిని వెంటనే క్వారంటైన్‌కు తరలించి.. నమూనాలను సేకరించాలని సూచించారు. ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్‌ను నిర్వహించాలని, ఒకేచోట భోజనం, కలిసి ఉండటం లాంటివి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. క్యారంటైన్ వ్యర్థాలను బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఏజెన్సీకి అప్పగించాలని సీఎస్ సూచించారు.