జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో వేరుశనగ పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ ప్రారంభమైన నాటి నుంచి ఈ ఏడు వేరుశనగకు.. తొలిసారిగా రికార్డు స్థాయి ధర రూ.7995 పలికింది.
క్వింటాల్‌కు రూ.7995
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం కాలూరు గ్రామానికి చెందిన రైతు మద్దిలేటి బుధవారం రోజున తాను పండించిన వేరుశనగను గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు విక్రయానికి తీసుకొచ్చాడు. వేరుశనగ కాయ నాణ్యత బాగా ఉండటంతో ట్రేడరు క్వింటాలుకు రూ.7,995 ధర చెల్లించారు.
1059 క్వింటాళ్ల వేరుశనగ
గద్వాల మార్కెట్‌కు 1,059 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. క్వింటాల్‌కు గరిష్ఠంగా రూ.7,712, కనిష్ఠంగా రూ.3,300 పలికింది. ఆముదాలు 18 క్వింటాళ్లు రాగా అత్యధికంగా రూ.4,130, అత్యల్పంగా రూ.3,857 ధర వచ్చింది. వరి 17 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.1,782 , కనిష్ఠంగా రూ.1,551 ధర ఉంది. కందులు 230 క్వింటాళ్లు రాగా అత్యధికంగా రూ.5,826 , అత్యల్పంగా రూ.4,559 ధర లభించింది.
అంతా ఆనందం
మార్కెట్‌లో పంటలకు మద్దతు ధరలు లభిస్తుండటం వల్ల మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ రామేశ్వరమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఇదే అత్యధిక ధర కావడం వల్ల అన్నదాతలు ఆనంద పడుతున్నారు.