జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌లో భారత్ బంద్‌కు మద్దతుగా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద జాతీయ రహదారిని తెరాస శ్రేణులు దిగ్బంధం చేశాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో కలిసి నినాదాలు చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకు వామపక్షాలు మద్దతు తెలిపాయి.
కేంద్రం వెంటనే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని లేని పక్షంలో వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని మంత్రి అన్నారు. దేశంలో 60 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని.. నూతన చట్టాల ద్వారా వారిని అగాధంలోకి తోస్తోందని దుయ్యబట్టారు. 12 రోజులుగా దేశ రాజధాని దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతుల గోడును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.