తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతకాలంనాటి భవనాలు.. భయాందోళనలో ప్రజలు - పేట పురపాలిక తాజా వార్తలు

జోగులాంబ గద్వాల జిల్లాలోని పేట పురపాలికలో వందల సంఖ్యలో పాత ఇళ్లు ఉన్నాయి. అందులో కొన్ని చెక్కుచెదరకుండా, మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలంలో పాతకాలంనాటి ఇంటి మిద్దెలు, గోడలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంతా జరుగుతున్న అధికారులు చర్యలేమి తీసుకోవట్లేదని ప్రజలు వాపోతున్నారు.

పాతకాలంనాటి భవనాలు.. భయాందోళనలో ప్రజలు
పాతకాలంనాటి భవనాలు.. భయాందోళనలో ప్రజలు

By

Published : Jul 30, 2020, 11:56 AM IST

వర్షాకాలం వచ్చిందంటే పాత ఇళ్లలో ఉంటున్న వారు బిక్కుబిక్కుమంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని పేట పురపాలికలో వందల సంఖ్యలో పాత ఇళ్లు ఉన్నాయి. అందులో కొన్ని చెక్కుచెదరకుండా, మరికొన్ని శిథిలావస్థకు చేరాయి. వర్షాకాలంలో పాతకాలంనాటి ఇంటి మిద్దెలు, గోడలు కూలి ప్రమాదాలు జరుగుతున్నాయి. వర్షాకాలం రాకముందే పుర అధికారులు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాలి. పురంలో మాత్రం అలాంటి చర్యలేవీ కనిపించడం లేదు.

పురంలో ఇదీ పరిస్థితి...

వానాకాలంలో వర్షం వస్తోందంటే శిథిలమైన పక్కింటి గోడ ఎప్పుడు కూలుతుందోనని రాత్రుళ్లు నిద్ర పట్టనివారూ ఉన్నారు. పట్టణంలోని ఇళ్ల మధ్య పాతకాలంనాటి భవనాలు కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. పురాతన కాలంలో నిర్మించిన రాతి గోడలు అలాగే ఉన్నాయి. అవి ఎప్పుడు కూలుతాయోనని పక్కనున్న ఇళ్లవారు ఆందోళన చెందుతున్నారు.

పురపాలికలో 24 వార్డులున్నాయి. కొత్త కాలనీల్లో తప్ప పాతవాటిలో ఏళ్లనాటి భవనాలు వందల సంఖ్యలో ఉన్నాయి. అవి శిథిలావస్థకు చేరడం వల్ల వాటి యజమానులు ఇతరచోట ఇళ్లు నిర్మించుకొన్నారు. దీంతో పాతవాటి పక్కనే ఉన్న ఇతర భవనాలకు ప్రమాదం పొంచి ఉంది.

పట్టణంలోని బాహర్‌పేట, పళ్ల, బ్రాహ్మణవాడి, మడి, సుభాష్‌రోడ్డు తదితర కాలనీల్లో అతి పురాతన భవనాలు అధికంగా ఉన్నాయి. శిథిలావస్థ భవనాలు కాలనీ మధ్యలో ఉన్నందున విషపురుగుల భయమూ వెంటాడుతోందని స్థానికులు వాపోతున్నారు.

పాత భవనాల యజమానులకు నోటీసులు..

పట్టణంలో ఏటా కాలం చెల్లిన భవనాల గుర్తింపు జరుగుతున్నా.. తీసుకుంటున్న చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2018లో 37, 2019లో 34, ఈ ఏడాది 30 పాత భవనాలను గుర్తించారు. వారికి నోటీసులూ అందించారు. నోటీసులు ఇచ్చి చర్యలు మాత్రం తీసుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. పాత భవనాలపై నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.

కూలిన భవనాలతో అవస్థలు..

కూలిన ఇళ్లకు పక్కనున్న వారికి అవస్థలు తప్పడం లేదు. వాడుకలో లేని శిథిల భవనాలపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు. శిథిల భవనాల్లో కంపచెట్లు పెరిగి పందులకు ఆవాసాలుగా మారుతున్నాయని, కొన్నిసార్లు అవి చనిపోతుండడం వల్ల కుళ్లిన వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పట్టణంలో కాలం చెల్లిన, శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

భవన యజమానులకు నోటీసులిచ్చాం..

పేటలో కాలం చెల్లిన భవనాలను గుర్తించి, వాటి యజమానులకు నోటీసులిచ్చాం. వర్షాకాలంలో పాతకాలంనాటి ఇళ్లు కూలే ప్రమాదముంది. కూలేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే ఖాళీ చేయడం మంచిది. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండడంతోపాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి.

- శ్రీనివాసన్, పుర కమిషనర్,పేట

ఇదీ చదవడి:సకల సౌకర్యాలతో.. సరికొత్త హంగులతో నూతన సచివాలయం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details