Paddy Procurement in Gadwal : జోగులాంబ గద్వాల జిల్లాలో ధాన్యం అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతుల ఇబ్బందులు తప్పట్లేవు. నిర్ణీత తేమశాతం, నాణ్యత ప్రమాణాలకు లోబడి ధాన్యం ఉంటేనే తూకం వేస్తామని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తేల్చిచెబుతున్నారు. దీంతో తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టి, తూర్పారాపట్టి నాణ్యత ప్రమాణాలు లోబడి ఉండేలా సిద్ధం చేసినా, కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎఫ్ఎక్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యం బస్తాలను తూకం వేసి మిల్లుకు పంపినా, ఆ ధాన్యాన్ని దింపుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. క్వింటాకు దాదాపు 8 కిలోలు వరకు అదనంగా మిల్లర్లు దోచుకుంటున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Paddy Procurement problems in Gadwal : రైతులు ఆందోళన బాట పట్టినా మిలర్లు మాత్రం తరుగుకు అంగీకరిస్తేనే దింపుకుంటామంటూ మొండికేస్తున్నారు. కస్టమ్ మిల్లింగ్ కింద క్వింటా ధాన్యం అప్పగిస్తే అందులో 67- 68 కిలోల ముడిబియ్యం లేదా ఉప్పుడు బియ్యాన్ని మిల్లర్లు ఎఫ్సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈసారి జోగులాంబ గద్వాల జిల్లాలో పండించిన తరంగిణి, చంద్ర, మహేంద్ర, కేఎన్ఎమ్ లాంటి వివిధ రకాల ధాన్యం నుంచి 58 కిలోల బియ్యం మాత్రమే వస్తోందని, తాలు అధికంగా ఉంటోందని మిల్లర్లు చెబుతున్నారు. ఇలాగైతే రైతుతో పాటు, మిల్లర్లు నష్టపోతారని అందుకే ఈ విషయంలో ప్రభుత్వమే చొరవ చూపాలని మిలర్లు కోరుతున్నారు.