జోగులాంబ గద్వాల జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాల ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్న బాగోతం బయటపడింది. కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కి చిన్నారులకు ఆఫ్లైన్ క్లాసులు నిర్వహించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గద్వాల మండలం వీరాపురం సమీపంలో ఉన్న పాఠశాలను మండల విద్యాధికారి సురేశ్ తనిఖీ చేయగా ఈ విషయం బహిర్గతమైంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చిందని ఆయన తెలిపారు.
గత కొన్ని రోజులుగా ఎస్సార్ విద్యానికేతన్ పాఠశాలలో ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో మండల విద్యాధికారి సురేశ్ పాఠశాలను తనిఖీ చేశారు. అక్కడే తరగతి గదిలో ఉన్న విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రత్యక్ష తరగతులు నిర్వహించడంరపై పాఠశాల యాజమాన్యాన్ని ఆయన ప్రశ్నించారు. చిన్నారులకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీశారు. విద్యార్థులను వెంటనే ఇంటికి పంపించాల్సిందిగా పాఠశాల యాజమాన్యాన్ని ఆదేశించారు.
ఎస్సార్ విద్యానికేతన్ పాఠశాల యాజమాన్యాన్ని పలుమార్లు హెచ్చరించినా కూడా వారి తీరు మారడం లేదని మండల విద్యాధికారి సురేశ్ మండిపడ్డారు. ఇదే విషయంపై జిల్లా విద్యాధికారి మహమ్మద్ సిరాజుద్దీన్ను వివరణ కోరగా.. పాఠశాల నడుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అక్కడ పరిస్థితిపై పూర్తిస్థాయిలో ఆరా తీసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఈవో అన్నారు.