పురపోరులో అధికార, విపక్షాలు పోటాపోటీగా తలపడే మున్సిపాలిటీల్లో గద్వాల ఒకటి. 39 వార్డులున్న గద్వాలలో 80వేల జనాభా ఉండగా... 59వేల మంది ఓటర్లున్నారు. గద్వాల కోట పీఠాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
జోరు సాగించేందుకు కారు వ్యూహం...
ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లో జోరు సాగించిన కారు... బల్దీయా బరిలోనూ విజయపరంపర కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అన్ని వార్డుల తెరాస అభ్యర్థులను ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ముందుగానే ప్రకటించారు. ఛైర్మన్ అభ్యర్థిగా బీఎస్ కేశవ్‌ను ఖరారు చేశారు. 37వార్డులకు 77మంది తెరాస తరఫున నామపత్రాలు దాఖలు చేయగా... అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో నాయకత్వం తలమునకలైంది. అందరినీ కలుపుకొని పోతూ పీఠాన్ని కైవసం చేసుకుంటామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల కోటపై కాషాయ జెండా ఎగరేస్తాం...
గద్వాల మున్సిపాలిటీని భాజపా సైతం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. డీకే అరుణ సొంత పట్టణం కావటం వల్ల తమకున్న బలాన్ని నిరూపించుకునేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. భాజపా తరపున 37వార్డులకు గానూ 80మంది వరకు నామపత్రాలు దాఖలు చేశారు. అసంతృప్తులకు నేతలు నచ్చజెప్పే పనిలో పడ్డారు. తెరాస సర్కారు వైఫల్యాలను ఎండగట్టటమే ప్రచారాస్త్రంగా డీకే అరుణ జట్టు అధికారపార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది.