రాష్ట్రంలో బతుకమ్మ సంబురాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పెత్తర అమవాస్యను పురస్కరించుకుని ఎంగిలిపూల బతుకమ్మను నేడు జరుపుకుంటారు. ఇదే క్రమంలో విజయదశమి వేడుకల(Vijayadashami festival 2021)కు కూడా అమ్మవార్ల ఆలయాలన్ని సిద్ధమవుతున్నాయి. నవరాత్రుల కోసం ముస్తాబవుతున్నారు. రేపటి నుంచి నవరాత్రి వేడుకలు(Vijayadashami celebrations) ప్రారంభం కానున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో దుర్గామాత విగ్రహాలను నిలిపేందుకు భక్తులు మండపాలు సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయం(jogulamba temple)లోనూ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దేవి నవరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, క్యూలైన్లు, త్రాగునీటి వసతులు ఏర్పాటు చేశారు. జోగులాంబ అమ్మవారి ఆలయం, స్వామివారి ఆలయంతో పాటు నవబ్రహ్మ ఆలయాలను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.