తెలంగాణ

telangana

By

Published : Jan 10, 2022, 6:41 AM IST

ETV Bharat / state

Gadwal Handloom Park : గద్వాల చేనేత పార్కు.. నేతన్నల కల నెరవేరేదెన్నడు..?

Gadwal Handloom Park : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లోనే గద్వాలలో చేనేత పార్కుకు అడుగులు పడినా.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. తెలంగాణ ఏర్పడ్డాక గద్వాల శివారులోని పూడూరులో 2018లో చేనేత పార్కు, పరిపాలన భవన సముదాయం, కామన్‌ ఫెసిలిటీ కేంద్రానికి రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. పార్కుకు శ్రీకారం చుట్టి నాలుగేళ్లు గడుస్తున్నా.. ఎలాంటి పురోగతి లేదు. తమ ప్రాంతానికి చేనేత పార్కు వస్తుందని అక్కడి నేతన్నలు ఏళ్లతరబడి కళ్ల కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.

Gadwal Handloom Park
Gadwal Handloom Park

Gadwal Handloom Park : రాష్ట్రంలో పోచంపల్లి తరవాత రెండో చేనేత పార్కు గద్వాలకు వస్తుందని నేత కార్మికులు కలలు కంటున్నా ఏళ్లుగా వారి కోరిక నెరవేరడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే ఇక్కడ చేనేత పార్కుకు అడుగులు పడినా.. ఇప్పటి వరకు అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. తెలంగాణ ఏర్పడ్డాక గద్వాల శివారులోని పూడూరులో 2018లో చేనేత పార్కు, పరిపాలన భవన సముదాయం, కామన్‌ ఫెసిలిటీ కేంద్రానికి రాష్ట్ర చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. చేనేత పార్కుకు రూ.14.98 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులూ వెలువడ్డాయి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉంది. శంకుస్థాపన చేసి నాలుగేళ్లు కావొస్తున్నా ఎలాంటి పురోగతీ లేదు.

Handloom Park at Gadwal : ఉమ్మడి పాలమూరులోని రాజోలి, అమరచింత, కొత్తకోట, కోటకొండతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఎమ్మిగనూరు, ఆదోని, కొడుమూరు ప్రాంతాల్లో గద్వాల బ్రాండు చీరలు నేస్తారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోనే సుమారుగా 3,250 మగ్గాలు ఉన్నాయి. 6వేల మంది చేనేత కార్మికులు ప్రత్యక్షంగా, 15వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. గిట్టుబాటు కాక ప్రస్తుతం చేనేత కార్మికులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చేనేత పార్కు ఏర్పడితే నేత కార్మికులకు కులవృత్తిలో పూర్వ వైభవం వస్తుంది. 2018లో మాస్టర్‌ వీవర్స్‌ రూ.4.16 కోట్లు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చారు. పోచంపల్లికి వెళ్లి అక్కడ అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి వచ్చారు. 47 ఎకరాల స్థలంలో పది ఎకరాలపై తమకు యాజమాన్య హక్కు కల్పించాలని పట్టుబట్టారు. నిబంధనలు ఒప్పుకోవని అధికారులు చెప్పడంతో ఈ పరిశ్రమ డీపీఆర్‌ ముందుకు సాగలేదు.

మళ్లీ డీపీఆర్‌ సిద్ధం చేస్తున్నారు

Weaver's Park at Gadwal : 'ప్రస్తుతం 10 ఎకరాల్లో పరిపాలన భవనం, కామన్‌ ఫెసిలిటీ కేంద్రం, మౌలిక వసతుల కోసం ఓ ఏజెన్సీ మళ్లీ డీపీఆర్‌ సిద్ధం చేస్తోంది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే నిధుల కేటాయింపు, పనులు మొదలవుతాయి.'

- గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళి శాఖ అధికారి, గద్వాల

పార్కు కోసం పడిన అడుగులు ఇలా..

  • గద్వాల చీరలకు 2008లో పేటెంట్‌ హక్కు లభించింది.
  • 2008లో గద్వాల శివారులోని పూడూరు వద్ద పార్కు నిర్మాణం చేపట్టాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. అదే సంవత్సరం అక్టోబరు 5న నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పార్కుకు సంబంధించి స్థానిక మార్కెట్‌ యార్డులో శంకుస్థాపన చేశారు
  • మొదటి విడతగా రూ.50 లక్షలను ప్రభుత్వం కేటాయించింది.
  • రూ.8.50 లక్షలు ఖర్చు చేసి స్థలానికి సంబంధించిన హద్దులను గుర్తించి బోర్డులు ఏర్పాటు చేశారు
  • తెలంగాణ ఏర్పడ్డాక 2018 జనవరి 31న మంత్రి కేటీఆర్‌ మళ్లీ శంకుస్థాపన చేశారు.

ABOUT THE AUTHOR

...view details