ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు చేపట్టనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పుర కమిషనర్లు, ఛైర్పర్సన్లు, కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు నియమ నిబద్ధతతో పనిచేసి పురపాలికలను అభివృద్ధి చేసుకోవాలని గద్వాల కలెక్టర్ శృతి ఓజా అన్నారు. శనివారం స్థానిక హరిత హోటల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి - ప్రణాళిక సదస్సును కలెక్టర్ అధ్యక్షత వహించగా గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌రెడ్డి, డా.వీఎం.అబ్రహాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ప్రభుత్వం 2019 అక్టోబర్‌లో తెచ్చిన కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం అన్ని పురపాలికల్లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బంధీగా నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి వార్డుకు ప్రత్యేక అధికారిని నియమించి అందులో నాలుగు పౌర కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో మహిళా కమిటీ, యువజన కమిటీ, విశ్రాంత ఉద్యోగులతో కూడిన కమిటీ, ప్రజా ప్రతినిధుల కమిటీలు ఉంటాయన్నారు.