Bandi Sanjay on TRS: ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేయలేని పనిని కేంద్రం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. కేవలం 6 నెలల్లో ఆర్డీఎస్ ద్వారా నీళ్లిస్తామని కేంద్రం స్పష్టం చేసిందని వెల్లడించారు. ఆర్డీఎస్ అంశంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని పరిష్కరించమని కోరామని సంజయ్ పేర్కొన్నారు. కేఆర్‌ఎంబీ ద్వారా ఆర్డీఎస్ హెడ్ రెగ్యులేటరీ మరమ్మతు చేయనున్నామని ప్రకటించారు. ప్రాజెక్టు వద్ద టెలిమెట్రీ యంత్రాలు అమర్చనున్నట్లు తెలిపారు. 2023లో మార్పునకు ప్రజలు నాంది పలకాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రానికి 2021 వరకు కేంద్రం రూ.1.68 లక్షల కోట్లు ఇచ్చిందని బండి సంజయ్ వెల్లడించారు. మరో రూ.1.50 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో వచ్చాయని తెలిపారు. తెలంగాణకు నిధులిస్తున్న ప్రధాని మోదీని విమర్శిస్తారా? అని తెరాస నాయకులపై మండిపడ్డారు. పాతబస్తీలో వేధింపులకు గురైన వారినే అధికారులుగా నియమిస్తామని సంజయ్ స్పష్టం చేశారు. భాజపా కార్యకర్త సాయి గణేశ్ త్యాగాన్ని వృథా కానీవ్వమని... ఆత్మహత్యకు కారణమైన వారిపై కచ్చితంగా బదులు తీర్చుకుంటామని తేల్చిచెప్పారు. రామాయంపేట, ఖమ్మం, కోదాడ అఘాయిత్యాలకు తెరాస నాయకులే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఎన్ని రోజులు భరిస్తామని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'దళితులకు మూడెకరాల భూమి, దళితున్ని సీఎం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారు. 2023లో ప్రజలే మార్పునకు నాంది పలకాలి. ప్రజాసంగ్రామ యాత్రకు మీ ఆశీర్వాదం ఉండాలి. ఆర్డీఎస్ సమస్యను పరిష్కరించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు. గ్రామ పంచాయతీలకు కేంద్రమే నిధులిస్తోంది. కేంద్రం నిధులిస్తుంటే ప్రధానిని విమర్శిస్తారా? కేంద్రం ఇస్తున్న నిధులను తెరాస ప్రభుత్వం దారి మళ్లీస్తోంది. భాజపా అధికారంలోకి రాగానే పాతబస్తీలో జరుగుతున్న అన్యాయాలను అడ్డుకుంటున్న పోలీస్ సిబ్బందినే అధికారులుగా నియమిస్తాం.' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు