Former MLA Patil Neeraja Reddy Died: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాటిల్ నీరజారెడ్డి మరణించారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీచుపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా కారు టైర్ పేలి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతంలో పాటిల్ నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఫ్యాక్షన్ గొడవల్లో శేషిరెడ్డి హత్యకు గురయ్యారు. నీరజారెడ్డికి ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆలూరు నియోజకవర్గం నుంచి 2009 నుంచి 2014 వరకు పనిచేశారు. అంతకుముందు స్వతంత్ర అభ్యర్థిగా పత్తికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా దేవరకొండ మండలం ఆలూరు నియోజకవర్గంలో చేర్చారు. దీంతో 2009లో ఆలూరులో కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. పీఆర్పీ అభ్యర్థిపై 5,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ తర్వాత వైసీపీ గూటికి చేరారు. అక్కడ ఇమడలేక ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.