తెలంగాణ వరప్రదాయని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ఈ నెల 1 నుంచి దశలవారీగా పంపుల ద్వారా గోదావరి జలాలను గ్రావిటీ కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఇప్పటికే 1, 3, 4, 6 వ పంపుల ద్వారా నీటిని ఎత్తిపోయగా... ఆదివారం ఐదో పంపును ప్రారంభించి నీటిని కాలువలోకి విడుదల చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద జలకళ
మొత్తం 5 పంపుల ద్వారా 10 పైపుల నుంచి ఏకధాటిగా గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహంతో... కన్నెపల్లి పంపుహౌస్, మేడిగడ్డ బ్యారేజీ కళకళలాడుతున్నాయి. గ్రావిటీ కెనాల్లోకి గోదావరి జలాలు పరుగులు పెట్టడం సందర్శకులను ఆకట్టుకుంటోంది. ఒక్కో పంపు నుంచి 2,300 క్యూసెక్కుల చొప్పున మొత్తం 11,500 క్యూసెక్కుల మేర నీరు విడుదలవుతోంది.