తెలంగాణ

telangana

ETV Bharat / state

Tigers migration to Telangana: పులి చూపు... తెలంగాణ అడవుల వైపు! - Telangana tigers information

Tigers migration to Telangana: పులల చూపు తెలంగాణ అడవుల వైపు పడింది. రాష్ట్రానికి ఎగువ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాల నుంచి పులులు రాష్ట్రానికి వలస వస్తున్నాయి. అక్కడ ఏర్పడిన ఆహార కొరత ఇందుకు ప్రధాన కారణంగా అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tigers
Tiger

By

Published : Dec 26, 2021, 4:33 PM IST

Tigers migration to Telangana: పెద్దపులులు అనువైన ఆవాసం కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. పులులు సాధారణంగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాయి. ఎక్కువ సంఖ్యలో గుంపుగా ఉండేందుకు ఇష్టపడవు. ఇందువల్ల నూతన ఆవాసం కోసం వెతుక్కుంటూ ఉమ్మడి వరంగల్ జిల్లా అడవుల వైపు వస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వ్ నుంచి ప్రాణహిత నది దాటి అసిఫాబాద్, మంచిర్యాల జిల్లా అడవులకు వస్తున్నాయి. అటువైపే కాకుండా గోదావరి నదిని దాటి జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వలస వస్తున్నాయి.

పులి అడుగులు (పగ్ మార్క్)

రెండు దశాబ్దాల తర్వాత...

దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత జయశంకర్ భూపాలపల్లి, ములుగు ప్రాంతాల్లోకి పులి ప్రవేశించింది. ప్రస్తుతం అడవులు వృద్ధి చెందడం, నీటి వసతి, శాకాహార వన్యప్రాణులు ఉండటంతో పులుల ఆవాసానికి నెలవుగా ఉన్నాయని.. అందుకే ఇటువైపు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పులుల వలసలు గతేడాది నుంచే ఆరంభమైంది. గత ఆగస్టు నెలలో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతీపూర్, చిట్యాల అడవుల్లో పులి అడుగులు కనిపించాయి. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబర్ నెలలో ఏటూరునాగారం అభయారణ్యం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలం అడవుల్లో అడుగులు కనిపించాయి. తర్వాత పెద్దపల్లి జిల్లా, అనంతరం రామగుండం ప్రాంతం నుంచి మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించింది.

కెమెరాకు చిక్కిన పులి

తర్వాత మరోపులికి సంబంధించి అడుగులు అక్టోబర్ నెలలో ములుగు జిల్లా సర్వాయి ప్రాంతంలో కనిపించాయి. తర్వాత మహబూబాబాద్ జిల్లా మీదుగా భద్రాద్రి కొత్తగూడెం అడవుల వైపు వెళ్లింది. అనంతరం ఉనికి కనిపించలేదు. తర్వాత ఈ యేడాది అక్టోబర్ నెలలో కొడిశాల అడవుల్లో ఓ పులిని హతమార్చి చర్మం, గోళ్లను విక్రయించేందుకు ప్రయత్నం చేస్తూ వేటగాళ్లు పోలీసులకు దొరికారు. నవంబర్ 8న మరో పులి ములుగు జిల్లా కామారం అడవుల్లో అడుగు జాడలు కనిపించాయి. నవంబర్ 29న వరంగల్ జిల్లాలోని పాకాల సరస్సు వద్ద పులి రోడ్డు దాటుతూ కనిపించింది.

పులుల సంఖ్య ఎక్కువై...

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్‌ మహారాష్ట్రలోని తాడోబా టైగర్ రిజర్వుల్లో పులుల సంఖ్య ఎక్కువైంది. కొత్త ప్రదేశాల కోసం వెతుక్కుంటున్నాయని అందుకే ఇటువైపుగా వస్తున్నాయని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పులులు సంఖ్య ఎక్కువ కావడం వల్ల ఆహార కొరత ఏర్పడుతోందన్నారు. గోదావరి, ప్రాణిహిత తీర ప్రాంతాల్లో దట్టమైన అడవులు, నీటి సౌకర్యాలు, శాఖాహార జంతువులు ఎక్కువగా ఉండటం వల్ల ఇటువైపు వచ్చేందుకు ఇష్టపడుతున్నాయి. ఏటూరునాగారం, పాకాల అభయారణ్యాలు.. ఆ పక్కనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది.

Tigers

పులికి ఆహార కొరత ఉండవద్దని జూ నుంచి తీసుకొచ్చి దుప్పులను అటవీ శాఖ అధికారులు వదులుతున్నారు. శాఖాహార వన్యప్రాణుల వృద్ధి కోసం అడవుల్లో గడ్డిమైదానాలు పెంచుతున్నారు. నీటి సౌకర్యాల కోసం సోలార్ పంప్‌సెట్లు, చెరువులు తవ్వడం, చెక్ డ్యామ్‌లు నిర్మించి నీటి వసతులు కల్పిస్తున్నారు.

వేటగాళ్లతో ముప్పు...

పులులకు వేటగాళ్లతో ముప్పు పొంచి ఉంది. వీటి సంరక్షణ కోసం మరిన్ని జాగ్రత్తలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది అక్టోబర్ నెలలో తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో వేటగాళ్లు ఉచ్చులు అమర్చి పులిని వేటాడారు. తాజాగా ఛత్తీస్​గఢ్ నుంచి పులి చర్మాన్ని తరలిస్తుండగా ములుగు జిల్లా జగన్నాథపురం జంక్షన్ వద్ద ముఠా పట్టుబడింది. ఇలాంటి ఘటనలు సంభవించకుండా మరింత జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. అడవుల్లో వేట నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల వారు పులికి హాని కలిగించకుండా ఉండేలా అవగాహన కల్పించాలి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details