తెలంగాణ

telangana

ETV Bharat / state

శిథిలావస్థలో కోటగుళ్లు ఆలయ పరిసరాలు.. నిధులు మంజూరు కాక అవస్థలు.. - కాకతీయులు కట్టించిన కోటగుళ్లు ఆలయం

Kotagullu temple: ప్రసిద్ధ కాకతీయుల కట్టడమైన భూపాలపల్లి జిల్లా కోటగుళ్లు ఆలయ పరిసరాలు శిథిలావత్సకు చేరుకున్నాయి. దీంతో విలువైన శిల్ప కళాకృతుల అందాలను సందర్శకులు వీక్షించే భాగ్యం  లేకుండా పోతోంది. ఆలయ పునరుద్ధరణ పనులు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా... పనులు ముందుకు సాగకపోవడంతో అభివృద్ధి జరగటం లేదు.

Kotagullu
Kotagullu

By

Published : Jan 16, 2023, 9:58 AM IST

Updated : Jan 16, 2023, 11:28 AM IST

శిథిలావస్థలో కోటగుళ్లు ఆలయ పరిసరాలు.. నిధులు మంజూరు కాక అవస్థలు..

Kotagullu temple: కాకతీయుల కళా వైభవానికి నిలువెత్తు సాక్ష్యం ఓరుగల్లు నగరం. ఎన్నో అత్యద్భుతమైన కట్టడాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఇటీవలే యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయం, వేయి స్తంభాల గుడి కట్టడాలు పర్యాటకులు మనసును దోచేస్తాయి. ఇటువంటి కళా సౌందర్యం కలిగిన మరో కట్టడమే భూపాలపల్లి జిల్లాలోని కోటగళ్లు ఆలయం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలంలోని కోటగుళ్లుగా ప్రసిద్ధి చెందిన గణపేశ్వరాలయంలో ప్రతీ శిల్పంలో జీవకళ ఉట్టిపడుతుంది. కాకతీయుల కాలంనాటి ప్రజల జీవన విధానం, వేష, భాషలు, సంస్కృతీ, సంప్రదాయాల్ని ఈ ఆలయాలు ఆవిష్కరిస్తాయి.

గణపతి దేవ చక్రవర్తి, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు శివరాత్రి రోజు ఇక్కడకు వచ్చి పూజలు చేసే వారిని చరిత్ర చెబుతోంది. ఓరుగల్లుపై దండయాత్రలకు వెళ్లే మార్గంలోనే ఈ ఆలయం ఉన్నందున తరచూ ఈ ఆలయం దాడులకు గురైంది. పదేళ్లుగా ఈ ఆలయం మరమ్మతులకు నోటుకోలేదు. రెండేళ్ల క్రితం రూ.2కోట్లు కేటాయించినా నిధులు మంజూరు చేయలేదు- యాదగిరి గౌడ్, పద్య నాటక కవి

కాకతీయ రాజ్యానికి సామంత ప్రభువు, కాకతియ సేనాని రేచర్ల గణపతి రెడ్డి గణపేశ్వరాలయాన్ని క్రీ.శ 1,234 సంవత్సరంలో నిర్మించారు. దీనికి గర్భగుడిలో గణపేశ్వర లింగేశ్వరుడితో పాటు చుట్టూ నిర్మించిన గుడుల సమూహం ఉండటంతో.... కోటగుళ్లుగా పేరొచ్చింది. వెలకట్టలేని శిల్ప సంపదతో అలరారే ఈ ఆలయం.. పూర్తి శిథిలావస్థకు చేరుకున్నా....పట్టించుకునే వారు లేకుండా పోతున్నారు. దీని పునరుద్ధరణకు ప్రభుత్వం 2 కోట్లు కేటాయించడంతో పునరుద్ధరణ పనులు చేపట్టారు. అనంతరం నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పనులను నిలిపివేశారు. ఫలితంగా ఆలయ అభివృద్ధికి నోచుకోక... శిధిలావస్ధకు చేరింది.

ఇక్కడ 22 ఆలయాలున్నాయి. రామప్ప ఆలయంలాగానే వీటిని నిర్మించారు. గతంలో 2 కోట్లు మంజూరు అయినప్పుడు అధికారులు వచ్చి పది ఆలయాల కప్పు విప్పారు. తరువాత వాటిని పట్టించుకోలేదు. దాతలు అవసరమైన చిన్నచిన్న మరమ్మతులు చేయించారు. ధూపదీప నైవేద్యాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు రావడం లేదు- మామిళ్ల మల్లిఖార్జున్, స్ధానికుడు

ఆలయాలన్ని శిథిలావస్థకు చేరాయి. ఇక్కడ మొత్తం 22 ఉపాలయాలు ఉన్నాయి. వీటిని పునరుద్ధరిస్తే.. కాకతీయ కళాసంపద గురించి ప్రజలకు తెలుస్తుంది. రామప్ప తరహాలో దీనిని అభివృద్ధి చేసే అవకాశం ఉంది- యుగంధర్, పర్యాటక శాఖ గైడ్


వారసత్వ సంపదగా రామప్పకు గుర్తింపు రావడంతో... ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతోంది. రామప్పను దర్శించుకుని... ఈ ఆలయానికి వచ్చే సందర్శకుల తాకిడి పెరగింది. అయినప్పటికీ వారికి ఎలాంటి సదుపాయాలు లేవు. కనుక ప్రభుత్వం తక్షణమే నిధులు కేటాయించి... ఆలయ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 16, 2023, 11:28 AM IST

ABOUT THE AUTHOR

...view details