Rain in TS: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు పడనున్నాయి. ఎల్లుండి కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి బలహీనపడిందని గాలులు నైరుతి నుంచి తెలంగాణ వైపు వీస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
హైదరాబాద్‌లో వర్షం:జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ముషీరాబాద్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, బాగ్‌లింగంపల్లి, విద్యానగర్, కవాడిగూడ ప్రాంతాల్లో వర్షం దంచికొడుతోంది. దోమలగూడ, రామ్‌నగర్, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల,టేకుమట్ల, మొగుళ్లపల్లి, కాటారం, మహదేవపూర్, మహాముత్తారం, మలహల్ రావు, పాలిమల మండలాలలో వర్షం కురిసింది. కారుమబ్బులు కమ్ముకురావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.