జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో జూన్ 6న దళిత కుటుంబానికి చెందిన రేవల్లి రాజాబాబు హత్యకు గురై మరణించాడు. రాజబాబు హత్యకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఛలో మల్లారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట అధ్యక్షుడు నగారి ప్రీతమ్ పిలుపు మేరకు అనేక మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఛలో మల్లారం కార్యక్రమంలో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరారు. మల్లారం గ్రామంలో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు మల్లారం గ్రామానికి వెళ్లే దారులను బారికేడ్లతో మూసివేసి, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మల్లారం వచ్చేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రోడ్డు మార్గాన మల్లారం గ్రామానికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను మార్గమధ్యలోనే ఆపి.. కొయ్యూరు పోలీస్ స్టేషన్కి తరలించారు.
ఛలో మల్లారం కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ శ్రేణుల అరెస్టు
దళిత కుటుంబానికి చెందిన రేవల్లి రాజాబాబు హత్యకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఎస్సీ విభాగం తలపెట్టిన ఛలో మల్లారం కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భూపాలపల్లి జిల్లాలోని మల్లారం గ్రామానికి తరలివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకొని అరెస్టు చేశారు.
మల్లారం గ్రామాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండు రోజుల పాటు 144 సెక్షన్ విధించారు. గుర్తు తెలియని వాహనాలు, ఇతర గ్రామాల వారిని మల్లారం గ్రామంలోకి అనుమతించడం లేదు. మూడు రోజుల కింద కాటారం ఎస్పీడీవో బోనాల కిషన్ ఛలో మల్లారం కార్యక్రమాన్ని విరమించుకోవాలని వివిధ పార్టీలకు సూచించారు. పోలీసు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పలు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని చెప్పినప్పటికీ.. పలు పార్టీలకు చెందిన కార్యకర్తలు మల్లారం రావడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డగించి ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఇవీ చూడండి:శరవేగంగా వైరస్ వ్యాప్తి.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు