కేంద్ర పర్యావరణశాఖ తీరుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. భూపాలపల్లి జిల్లా కాకతీయ గని-2లో నింబంధనలకు విరుద్ధంగా మైనింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. బొగ్గు కంపెనీతో కుమ్మక్కై నిబంధనలు ఇష్టారాజ్యంగా మార్చారని మండిపడింది. నివాసాలకు సమీపంలో పేలుళ్లు జరుపుతున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్జీటీ దృష్టి తీసుకొచ్చారు. నిబంధనలు సడలించాలని సింగరేణి కేంద్ర పర్యావరణ శాఖను ఎందుకు కోరిందని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని నిలదీసింది. 500 మీటర్ల లోపు మైనింగ్ జరపకపోతే నిబంధనలు ఎందుకు సడలించాలని కోరారని అడిగింది. తనిఖీలు జరిపించి వాస్తవాలను తెలుసుకోవాలని ఎన్జీటీని కోరిన సింగరేణి సంస్థ తప్పుడు నివేదికలు ఇచ్చే పర్యావరణ శాఖ వారితో ఎలా తనిఖీలు చేయిస్తుందని ప్రశ్నించింది. కాకతీయ గని-2పై సాయంత్రం లేదా రేపు పూర్తి ఆదేశాలు వెలువరిస్తామని ఎన్జీటీ తెలిపింది.