కరోనా మహమ్మారి కట్టడికి విధించిన లాక్డౌన్ నిబంధనలను ప్రతి ఒక్కరు తు.చ. తప్పకుండా పాటించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు శాఖ సంక్షేమ మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. కరోనా వ్యాప్తి, నివారణపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో ఆరోగ్య అధికారులతో నిర్వహించిన సమీక్షలో పాల్గొన్నారు.
'ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు పాటించాలి' - telangana tribal minister satyavathi rathode
కరోనా వ్యాప్తి నివారించడానికే సీఎం కేసీఆర్ లాక్డౌన్ విధించారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాఠోడ్ అన్నారు. ప్రజలంతా దీనికి సహకరించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కరోనా వ్యాప్తిపై కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు.
లాక్డౌన్ సమయంలో వ్యవసాయానికి మినహాయింపు ఇచ్చారని, రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. కరోనా కట్టడి కోసం పనిచేసే ముఖ్య అధికారులు, ప్రజాప్రతినిధులతో ఒక్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దానిలో సమస్యలను చర్చించాలని చెప్పారు. గ్రామాల్లో ఉన్న కరోనా పరిస్థితులను, నివారణ చర్యలను చాటింపు వేసి ప్రజలను చైతన్య పరచాలని వివరించారు.
లాక్డౌన్ లేని నాలుగు గంటలు ప్రజలు గుమి కూడే ప్రాంతాలను గుర్తించి అక్కడ సరైన చర్యలు చేపట్టాలని, కొవిడ్ కేంద్రాలను సందర్శించి రోగులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. కరోనాకు చికిత్స అందించే ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యంతో సమావేశమై సమన్వయం చేయాలని చెప్పారు.