గులాబ్ తుపాను ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలకు వరద తాకిడి పెరుగుతోంది. దీంతో బ్యారేజీల గేట్లు ఎత్తి నీటిని భారీగా దిగువకు పంపిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
లక్ష్మీ బ్యారేజికి(మేడిగడ్డ) 5,10,230 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 79 గేట్లు ఎత్తి 5,98,350 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. సరస్వతి బ్యారేజికి (అన్నారం) 4,58,000 క్యూసెక్కుల ప్రవాహం రాగా 59 గేట్లు తెరిచి... 0.47 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గించినట్లు పేర్కొన్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో భారీగా వరుదనీరు వస్తుండటంతో... వచ్చిన నీటిని వచ్చినట్లుగా వదిలేస్తున్నామని అధికారులు తెలిపారు.