కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద - లక్ష్మీ బ్యారేజీకి వార్తలు
19:41 July 24
కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ(మేడిగడ్డ) బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహరాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో బ్యారేజీ నీటి మట్టం పెరుగుతోంది. గురువారం వరకు బ్యారేజీకి 44,800 క్యూసెక్కుల ప్రవాహం రాగా 24 గేట్లను ఎత్తి అంతే స్థాయిలో నీటిని వదిలారు. శుక్రవారం బ్యారేజీకి భారీగా ప్రవాహం రావడం వల్ల 63 గేట్లను ఎత్తి 1,27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం ఇన్ఫ్లో 1,35,400 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 16. 17 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 12.79 టీఎంసీలుగా ఉంది. సరస్వతి (అన్నారం) బ్యారేజీకి కూడా ఎగువ నుంచి 2100 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. నీటినిల్వ 8.7 టీఎంసీలకు చేరింది. మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన వరద ఉద్ధృతి క్రమేణ పెరుగుతోంది.