Grain Farmers Face Problems : రైతన్న పంటను సాగుచేయడం ఎంత కష్టమో. సకాలంలో అమ్ముకోవడం అంతకంటే ఎక్కువ కష్టంగా మారింది. అకాల వర్షాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు కొనుగోలు కేంద్రాల్లోనూ అవస్థలు పడుతున్నారు. పంటకోసి కేంద్రాల వద్దకు తీసుకొస్తే సకాలంలో లోడింగ్ కావడం లేదు. మిల్లుల్లో దిగుమతిలోనూ జాప్యమే అవుతోంది. దీంతో వారు పడిగాపులు కాస్తున్నారు. పైగా తూకంలో అడ్డగోలు కోతలు విధిస్తూ ఆరుగాలం కష్టం దోపిడీ చేస్తున్నారని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 185 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దాదాపు 20 రోజులుగా కేవలం 18 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. రైతులు పడుతున్న కష్టాలు అన్నీ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకున్నాయి.
జిల్లాకు కేవలం 7 మిల్లులు మాత్రమే కేటాయింపు : రేగొండ మండలంలో మిల్లుల్లో ధాన్యం నిల్వకు స్థలం లేక, మార్కెటింగ్ శాఖకు చెందిన గోదాంకు వాహనాల్ని తరలిస్తున్నారు. అయితే అక్కడా హమాలీల్లేక ధాన్యం బస్తాలు కిందకు దించడం లేదు. చిట్యాల మండలంలోనూ రైస్ మిల్లులు, వే బ్రిడ్జి వద్ద ధాన్యం వాహనాలు బారులు తీరాయి. రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని అధికారులు అట్టహాసంగా ప్రకటించినా.. క్షేత్ర స్థాయిలో రైతుకు అడుగడుగునా కష్టాలు తప్పటం లేదు. కేంద్రాల్లోకి ధాన్యం తీసుకొని వచ్చిన తర్వాత లోడింగ్ కాక రైతులు కంటి మీద కునుకు లేకుండా నిరీక్షిస్తున్నారు. జిల్లాకు కేవలం 7 మిల్లులు మాత్రమే కేటాయించడంతో ధాన్యం దించుకోవడం ఇబ్బందిగా మారింది. మిల్లుల్లో వానాకాలం ధాన్యం కూడా ఉండటంతో నిల్వ చేసేందుకు స్థలం కొరత ఏర్పడుతోందని ఆవేదన చెందారు.