జనగామ జిల్లా కేంద్రం నుంచి తీన్మార్ మల్లన్న పాదయాత్ర ప్రారంభించారు. తెలంగాణ ప్రజలను రాజులను చేయడానికే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. తెరాసను ఎదుర్కొవడానికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఒక ఆయుధమన్నారు. గులాబీ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఒక డమ్మీ అని విమర్శించారు. లక్షలాది మంది గొంతుక తీన్మార్ మల్లన్న అని.. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమయ్యానని చెప్పారు.
ప్రజలను రాజులను చేయడానికే పాదయాత్ర: తీన్మార్ మల్లన్న - జనగామ జిల్లా వార్తలు
తెలంగాణ ప్రజలను రాజులను చేయడానికే పాదయాత్ర చేస్తున్నానని తీన్మార్ మల్లన్న అన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభించారు.
ఎమ్మెల్సీగా గెలిపిస్తే రెండున్నర ఏళ్లలో పని చేయకపోతే రాజీనామా చేస్తానని తెలిపారు. 1.59 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న కేసిఆర్ జనగామ చౌరస్తాకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇంటికి ఒక ఫించన్ ఇస్తున్న సీఎం.. తన ఇంట్లో రెండు పదవులు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. కోదండరాం తనకు ప్రత్యర్థి కాదన్నారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కబ్జా చేశారని కలెక్టరే నిరూపించిందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని చూస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగంతో న్యాయంగా పోరాడతానని చెప్పారు.