బడికెళ్లే పిల్లలు రోజూ... ఏకరూప దుస్తులు ధరించి, టై, బెల్ట్, షూస్ వేసుకొని వెళ్లాలి. ఒకవేళ వేసుకోకపోతే.. ఏ పాఠశాలలో అయినా విద్యార్థులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారు. ఇదంతా చేయడానికి వెనుక కారణం పిల్లలు క్రమశిక్షణగా మెలగాలని, పద్ధతిగా ఉండాలని. కానీ జనగామ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం పిల్లలు ఐక్యతగా ఉండాలని వారే ఏకరూప దుస్తులు ధరించి బడికి వస్తున్నారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల మాదిరిగానే ఉపాధ్యాయులూ ఏకరూప దుస్తులు ధరిస్తున్నారు. పాఠశాలలో ఉపాధ్యాయులంతా ఐక్యతగా ఉండాలని... ఇలా చేస్తే పిల్లలు కూడా తమలాగే కలిసిమెలిసి ఉంటారనే ఈ పద్ధతి తీసుకొచ్చారు.