Priest is The God in Jangaon Temple :జనగామ జిల్లా తాటికొండ గ్రామంలో అర్చకుడిగా,ఆయుర్వేద వైద్యుడిగా విశేష సేవలందించేవారు శ్రీరంగాచార్యులు. గత ఏడాది శ్రీరంగాచార్యులు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆ పెద్దాయన లేని లోటు మరిచిపోలేకపోయారు గ్రామస్థులు. గుండెల్లో నిలిచిన అభిమానంతో పూజారి విగ్రహం తయారు చేయించారు. పూజారి కుటుంబ సభ్యులతో కలసి తాము కూడా చందాలేసి ఆరు లక్షల వ్యయంతో గుడి నిర్మిస్తున్నారు.
ఆ పూజారిని దేవుడిలా కొలుస్తున్న జనం
Villagers Build Temple For A Priest In Jangaon : శ్రీరంగాచార్యులు గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో 50 ఏళ్లుగా పూజలు నిర్వహించారు. దీంతో పాటు పరిసర గ్రామాల్లో పౌరోహిత్యం, ఆయుర్వేద వైద్యుడిగానూ వివిధ రకాల రుగ్మతలకు ఉచితంగా మందులు ఇస్తూ ప్రజలకు ఎనలేని సేవలందించారు. అనేక రకాలుగా సేవలు అందించిన అయ్యగారు మరణించడం కుటుంబ సభ్యులనే కాదు గ్రామస్తులను కలచి వేసింది. మళ్లీ ఆయన్ని సజీవంగా చూడాలనుకున్న గ్రామస్థులంతా గుడి కట్టాలని నిర్ణయించుకున్నారు.
"ఒక అర్చకుడికి ఆలయం కట్టించడం ఇదే తొలిసారి. మా నాన్న ఎన్నో సేవలు అందించారు కాబట్టే గ్రామస్థులంతా గుడి కట్టాలనుకుంటున్నారు. చుట్టు ప్రక్కల 20 గ్రామాలు, తండాలతో సహా స్టేషన్ ఘన్పూర్ పల్లెలకు సేవలందించారు. హైదరాబాద్లో కూడా నాన్న పని చేశారు. ఈనెల 4న ఆయన వర్దంతి రోజున విగ్రహ ప్రతిష్ట చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జరిపే సీతారాముల కల్యాణం రోజున రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలను పట్టుకొని వచ్చేవారు. ఆ విగ్రహాలను పట్టుకున్నట్లు పూజారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నాం." - లక్ష్మణాచార్యులు, శ్రీరంగాచార్యుల కుమారుడు