MLA's Brother name Dalit Bandhu Scheme: ఎస్సీల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు పథకం అమలులో కొన్నిచోట్ల అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలువురు ప్రజాప్రతినిధులు తమ అనుచరులు, కార్యకర్తలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జనగామ జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య సోదరుడు, ఘన్‌పూర్ సర్పంచి సురేశ్‌కుమార్ పేరు ఉండటం గమనార్హం. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. దళితబంధు పథకంలో ఎస్సీల్లో పేదలకే ఇవ్వాలనే నిబంధన లేదని, ప్రభుత్వ ఉద్యోగులు కాని 60 ఏళ్ల లోపు వారు అంతా అర్హులేనని వివరించారు.
నేనేం తీసుకోను:ఇదిలా ఉండగా... ఈ అంశంపై ఎమ్మెల్యే సోదరుడు ఘన్‌పూర్ సర్పంచ్ సురేశ్‌కుమార్ స్పందించారు. తనకు వర్తించిన దళితబంధు పథకం స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు తాటికొండ సురేశ్ కుమార్ ప్రకటించారు. జిల్లాలో ఎంపిక చేసిన 185 మంది లబ్ధిదారుల జాబితాలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సొదరుడు సురేష్ కుమార్ పేరు కూడా ఉండడం విమర్శలపాలైంది. నిరుపేదలకు ఉపయోగపడాల్సిన దళితబంధు పథకం తెరాస ప్రజాప్రతినిధులు దుర్వినియోగం చేస్తున్నారని.. తమ బంధువులు, కార్యకర్తలను అర్హుల జాబితాలో చేరుస్తున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవాళ స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆందోళనలకు సిద్ధమైన నేపథ్యంలో వివాదం మరింత ముదురక ముందే సురేశ్ కుమార్ మీడియా సమావేశాన్ని నిర్వహించి... స్వచ్ఛందంగా పథకం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.