MLA Rajaiah Vs Sarpanch Navya Issue Latest Update : జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జానకీపురం సర్పంచ్ నవ్య వివాదంలో కొత్త మలుపు చోటుచేసుకుంది. ఈ వివాదాన్ని జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించాయి. ఈ మేరకు పూర్తి విచారణ చేపట్టి నివేదిక అందించాల్సిందిగా పోలీస్ శాఖను ఆదేశించాయి. మహిళా కమిషన్ల ఆదేశాల మేరకు కాజీపేట ఏసీపీ.. సర్పంచ్ నవ్యకు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే రాజయ్యపై ఆరోపణలకు సంబంధించిన సాక్ష్యాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 3 రోజుల్లో పూర్తి సాక్ష్యాలు సమర్పించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
ఇదీ అసలు వివాదం..: ఎమ్మెల్యే రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ సర్పంచ్ నవ్య గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదాన్ని రాజయ్య, నవ్యసామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఒప్పందంలో భాగంగా జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం తన నిధుల నుంచి రూ.25 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే.. నవ్యకు హామీ ఇవ్వడంతో ఆ సమస్యకు అక్కడితో పుల్‌స్టాప్ పడింది. తాజాగా ఈ నెల 20న జానకీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రాజయ్య.. సర్పంచ్ నవ్యపై తీవ్ర ఆరోపణలు చేయడంతో సద్దుమణిగిన వివాదం కాస్తా.. మళ్లీ వార్తల్లోకెక్కింది.
MLA Rajaiah Vs Sarpanch Navya : ఆ మరునాడే ఒప్పందం పేరిట రాజయ్య తనను వేధింపులకు గురి చేస్తున్నాడంటూ నవ్య.. ధర్మసాగర్ పీఎస్‌లో కంప్లైంట్ చేశారు. ఎమ్మెల్యే సహా ఆయన అనుచరుడు శ్రీనివాస్, తన భర్త ప్రవీణ్, ఎంపీపీ కవితపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో ముగిసిపోయిందనుకున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చి.. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు ఈ వివాదాన్ని సుమోటోగా స్వీకరించడంతో కొత్త మలుపు చోటుచేసుకుంది.
ఇదీ కొత్త వివాదం..: గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా జానకీపురం గ్రామ అభివృద్ధి కోసం తనకు ఇస్తానన్న రూ.25 లక్షలు తనకు రాకముందే.. డబ్బులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోందంటూ సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయంపై నవ్య భర్త ప్రవీణ్ రాజయ్యను నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే రాజయ్య గ్రామాభివృద్ధికి రూ.25 లక్షలు, వ్యక్తిగతంగా రూ.20 లక్షలు ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రవీణ్‌కు రూ.7 లక్షలు ఇచ్చారు. మిగతా నగదు ఇవ్వాలని అడిగితే.. గతంలో తనపై చేసిన లైంగిక ఆరోపణలు రాజకీయ కోణంలో చేసినవని చెప్పాలని.. దీంతో పాటు రూ.20 లక్షలు మళ్లీ అడిగినప్పుడు తిరిగివ్వాలన్నారు. ఈ మేరకు ఒప్పంద పత్రంపై సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు.