తెలంగాణ

telangana

ETV Bharat / state

ఛల్లో మల్లారం వెళ్తున్న ఉత్తమ్​ కుమార్​ అరెస్ట్! - ఛలో మల్లారం

రాష్ట్రంలో ప్రతిరోజు ఏదో ఒక మూల దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని.. ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తూ.. భావ ప్రకటన స్వేచ్ఛను  హరిస్తున్నారని, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. దళిత కుటుంబానికి చెందిన రేవల్లి రాజాబాబు హత్యను నిరసిస్తూ చేపట్టిన ఛలో మల్లారం కార్యక్రమానికి బయల్దేరిన ఉత్తమ్​ కుమార్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అరెస్టు చేశారు.

Janagama Police Arrest Uttam kumar Reddy
ఛల్లో మల్లారం వెళ్తున్న ఉత్తమ్​ కుమార్​ అరెస్ట్!

By

Published : Jul 26, 2020, 4:03 PM IST

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మల్హర్​ మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన దళితుడు రేవల్లి రాజాబాబు హత్యను నిరసిస్తూ కాంగ్రెస్​ పార్టీ, కాంగ్రెస్​ ఎస్సీ సెల్​ విభాగం ఛలో మల్లారం కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు హాజరు కావాలని కోరింది. కాంగ్రెస్​ పార్టీ పిలుపునకు స్పందించిన కార్యకర్తలు భారీగా ఛలో మల్లారం కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధం కాగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. మల్లారం గ్రామానికి బయల్దేరిన టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్​ కుమార్​ రెడ్డిని జనగామ పోలీసులు అరెస్టు చేసి.. లింగాల ఘనపూర్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

దళితులు, గిరిజనులు, బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా.. వారి మీద దాడులు చేసిన వారికి మద్ధతు పలకడం సరికాదని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, దళితులకు మూడెకరాల భూమి, దళిత ముఖ్యమంత్రి, 12 శాతం రిజర్వేషన్​ అన్నీ అబద్ధాలే అని మండిపడ్డారు. కనీసం మంత్రివర్గంలో కూడా ఒక్క దళితుడు లేకపోవడం కేసీఆర్​ అహంకారానికి నిదర్శనం అని ఆరోపించారు. దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, వారిపై ఎలాంటి దాడులు జరిగినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేస్తామన్నారు. దళిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయడాని తీవ్రంగా ఖండిస్తున్నామని, పోలీసుల సహాయంతో ప్రతిపక్షాలను అణిచివేయడం సరికాదని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి:శరవేగంగా వైరస్​ వ్యాప్తి‌.. మూడు వారాల్లోనే మూడు రెట్లు పెరిగిన కేసులు

ABOUT THE AUTHOR

...view details