జూన్ 12న ప్రారంభం కావాల్సిన విద్యా సంవత్సరం కరోనా నేపథ్యంలో వాయిదా పడింది. ఎప్పటికల్లా కరోనా అదుపులోకి వచ్చి పాఠశాలలు ప్రారంభించేదీ ఇంకా తెలవడంలేదు. కనీసం నెల రోజుల పాటు వాయిదా పడినా పాఠ్యాంశాల సెలబస్ తగ్గించినా ఇబ్బందేనని నిపుణులు భావిస్తున్నారు. ఆయా తరగతుల వారికి రావాల్సిన సామర్థ్యాలు సాధించలేకపోతారని భావిస్తున్నారు. మరో నెల రెండు నెలలకు పాఠశాలలు ప్రారంభించినా షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారని ఒక అంచనా. ఇదే అమలైతే అనుసరించాల్సిన వ్యూహాలపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
ప్రమాణాలు ఇలా..
రెండు నుంచి పది తరగతుల విద్యార్థులకు వర్క్ షీట్లు తయారు చేయాలని ఆదేశించింది. ఇందుకుగాను ప్రతి పాఠానికి సంబంధించిన అన్ని సామర్థ్యాలు ఆపాదించుకునే విధంగా పలు ప్రమాణాలు నిర్ణయించారు. బహుళ ఐచ్ఛిక సమాధానాలున్న ప్రశ్నలు, పట నైపుణ్యం, రెండు, మూడు వాక్యాల సమాధానాలు వచ్చే ప్రశ్నలు సహా ఖాళీలను పూరించడం, జత పరచడంలాంటి వర్క్ షీట్లను ప్రతి పాఠానికి తయారు చేయాలని ఆదేశించింది.