దమ్ముంటే సభను అడ్డుకోండి మా సత్తా ఎంటో చూపిస్తామన్న బండి సంజయ్ Bandi Sanjay Comments: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర 3 రోజుల తర్వాత ఆగిన చోట నుంచే ప్రారంభమైంది. శాంతిభద్రతల సమస్యతో యాత్రను ఆపేయాలంటూ ఈ నెల 23న నోటీసులు జారీ చేసిన పోలీసులు.. స్టేషన్ ఘనపూర్ మండలం పాంనూరు శివార్లలో సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేశారు. దీక్షాస్థలం నుంచి బండి సంజయ్‌ను కరీంనగర్‌కు తరలించి ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేశారు. ఈ వ్యవహారం హైకోర్టుకు చేరగా.. న్యాయస్థానం పచ్చజెండా ఊపడంతో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ పరిధిలోని పాంనూరు వద్ద పాదయాత్ర ప్రారంభమైంది.
ఈ క్రమంలోనే జనగామ జిల్లా జాఫర్‌గఢ్ మండలం కూనూరు గ్రామానికి చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్రలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. కూనూరులో తెరాస కార్యకర్త రాజు అనే వ్యక్తి 'సంజయ్ గో బ్యాక్' అంటూ నినాదాలు చేయడంతో భాజపా శ్రేణులు అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. లాఠీలకు పనిజెప్పి, ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ క్రమంలో పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు.
హనుమకొండలోకి ఎంట్రీ..: స్టేషన్ ఘనపూర్ మండలంలో ఉదయం ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర.. జనగామ జిల్లాలో పూర్తి చేసుకుని హనుమకొండ జిల్లాలోకి ప్రవేశించింది. ఐనవోలు మండలం గర్నేపల్లి గ్రామంలోకి ప్రవేశించిన యాత్రకు గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఊరూరా సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న బండి సంజయ్.. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ప్రజా సంగ్రామ యాత్ర పునఃప్రారంభానికి ముందు ఆయన తెరాస సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించేందుకు కేసీఆర్ ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. నయా నిజాంను తలపించేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారన్న సంజయ్.. ఎన్ని కుట్రలు పన్నినా పాదయాత్రలో వెనుకడుగు వేసేదేలేదన్నారు.
అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే.. ఇప్పుడు అనుమతులు లేవంటోంది. అధికార యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. కోర్టులపై మాకు విశ్వాసం ఉంది. హైకోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టే పాదయాత్ర మళ్లీ ప్రారంభించాం. కేసులు పెట్టినా, లాఠీఛార్జ్ చేసినా భరిస్తాం. యుద్ధంలో ధర్మమే గెలుస్తుంది. సీఎం కుటుంబంపై ఉన్న ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకే మాపై కేసులు పెడుతున్నారు. సీఎం తప్పనిసరిగా దీనిపై సమాధానం చెప్పాలి. కచ్చితంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో సభ నిర్వహిస్తాం. దమ్ముంటే మా సభను అడ్డుకోండి.. మా సత్తా ఎంటో చూపిస్తాం. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ధర్మం మా వైపే ఉంది..: మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా హనుమకొండ ఆర్ట్స్ కళాశాలలో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి రద్దు అంశం వివాదాస్పదమైంది. సభకు అవసరమైన ఏర్పాట్లు నేతలు చేసుకుంటుండగా.. పోలీసుల నుంచి అనుమతి లేదంటూ కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఇదే విషయమై భాజపా నేతలు హైకోర్టు ఆశ్రయించగా.. న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. సభ నిర్వహణకు అనుమతిచ్చింది. తెరాస సర్కార్ ఎన్ని కుట్రలు చేసినా ధర్మం తమ వైపు ఉన్నందునే న్యాయస్థానం అనుమతిచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. నడ్డా హాజరయ్యే బహిరంగ సభను విజయవంతం చేయాలని ప్రజలకు బండి కోరారు.
నడ్డా షెడ్యూల్ ఇదే..:రేపు ఉదయం 11.45 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. సతీసమేతంగా నగరానికి రానున్న నడ్డా.. శంషాబాద్ విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళ్లనున్నారు. అక్కడ ముందుగా వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. బహిరంగ సభ అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి దిల్లీకి తిరుగు పయనం కానున్నారు. రేపు హనుమకొండలో శనివారం నిర్వహించనున్న బహిరంగసభతో మూడో విడత ప్రజా సంగ్రామయాత్ర పూర్తికానుంది.