యువరైతు పండ్ల తోటల సాగు.. లాభాల బాట ఆలోచన, సాగుపై ఆసక్తి ఉండాలే గానీ... మంచి లాభాలు పొందొచ్చని ఓ యువరైతు నిరూపిస్తున్నాడు. జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామానికి చెందిన సుభాష్‌రెడ్డికి... 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇంజినీరింగ్ పూర్తి చేసిన సుభాష్‌రెడ్డి.. ఉద్యోగం కంటే పొలంలో కొత్త పంటల సాగు చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. 9 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలను తొలగించి... తొలత 5 ఎకరాల్లో జామ సాగు చేశాడు. జామ తోటలో ప్రతి ఏటా 5లక్షల ఆదాయం పొందుతుండగా... నూతన పంటల సాగు చేద్దాం అనే ఆలోచనతో గతేడాది రెండెకరాల్లో 4వేల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు సాగు చేశాడు. ప్రస్తుతం ఇది దశకు చేరింది. మరో పక్షం రోజుల్లో కోతకు రానుంది. వీటితోపాటు ఎకరన్నర ఎన్ఎంకే గోల్డ్ రకం సీతాఫలం సాగు చేపట్టాడు. ఉద్యోగం కంటే వ్యవసాయంలోనే మంచి ఆదాయం వస్తుందని చెబుతున్నాడు.
ఉద్యానశాఖ చేయూత
సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న సుభాష్‌రెడ్డికి... జగిత్యాల జిల్లా ఉద్యానశాఖ సైతం చేయుతనిస్తోంది. 'మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్' పథకంలో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ సాగు జగిత్యాల జిల్లాలో తొలిసారిగా చేపట్టారు. ఎకరాకు కనీసం 5 లక్షలకుపైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని జిల్లా ఉద్యానశాఖ అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పంటను కలెక్టర్ రవి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పరిశీలించారు. సాగు విధానం గురించి అడిగి తెలుసుకొని, సుభాష్‌రెడ్డిని అభినందించారు. కొత్త పంటల వైపు వెళ్లినప్పుడే అన్నదాత ఆదాయం పొందుతారని కలెక్టర్ అన్నారు. సాంప్రదాయ పంటలు కాకుండా... నూతన వాణిజ్య పంటలు సాగు చేయాలని అధికారులు సూచించారు. పంటను చూసేందుకు పరిసర ప్రాంతాల రైతులు కూడా వస్తున్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి