ఈ ఊరు ఐక్యత, అభివృద్ధిలో అందరికీ ఆదర్శం జగిత్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీపూర్ గ్రామం ఇంతింతై వటుడింతై అన్నట్లు ఒక్కో మెట్టు ఎదుగుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఇక్కడి రైతులు విభిన్న రకాల పంటలు పండించి, ఒక సొసైటీగా ఏర్పడి తమ పంటలను తామే విక్రయిస్తున్నారు. సమష్టి నిర్ణయాలతో, ఐక్యతతో విజయ పరంపర సాగిస్తూ రాష్ట్రంలోనే గుర్తింపు పొందుతున్నారు.
లక్ష్మీపూర్ బ్రాండ్
ఈ గ్రామంలో ఉన్న 2వేల ఎకరాల సాగు భూమిలో పసుపు, వరి, మొక్కజొన్న, వేరుశనగ, మామిడి, బొప్పాయి, అరటి, కూరగాయలు పండిస్తున్నారు. పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదని మూడేళ్ల క్రితం తమ గ్రామానికి చెందిన వరిని మరపట్టించి బియ్యంగా మార్చి 'లక్ష్మీపూర్ బ్రాండ్' పేరుతో విక్రయాలు ప్రారంభించారు. ఇలా మొదటి ఏడాదిలోనే క్వింటాల్‌కు ఐదు నుంచి ఏడు వందల వరకు అదనపు ఆదాయం పొందారు. ఇలా ఆ నోటా.. ఈ నోటా వివిధ ప్రాంతాలకు ఈ సమాచారం పాకటం వల్ల రెండో ఏడాది విక్రయాలు మరింత పెరిగాయి.
లక్ష్మీపూర్ సొసైటీ
లక్ష్మీపూర్ సొసైటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందులో 500 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. సమీప గ్రామాల అన్నదాతలూ ఇందులో సభ్యులుగా ఉండటం విశేషం. లక్ష్మీపూర్ బ్రాండ్‌తో వీరి విక్రయాల గురించి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ప్రత్యేకంగా అభినందించారు.
విత్తన తయారీ కూడా...
కేవలం బియ్యం ఉత్పత్తులతో ఆగకుండా విత్తనాల తయారీ కూడా మొదలు పెట్టారు లక్ష్మీపూర్ రైతులు. తాము పండించిన వరిలో మంచి వంగడాలను ఎంపిక చేసి విత్తన శుద్ధి యంత్రంలో నాణ్యమైన విత్తనాలు తయారు చేసి వినియోగించడమే కాకుండా విక్రయిస్తున్నారు. దీనివల్ల పెట్టుబడులు మిగిలిపోగా విత్తనాలు అమ్మడం వల్ల అదనంగా ఆదాయం వస్తోంది. రైతు సొసైటీ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేసిన రెండు ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే కమీషన్ ఆదాయం కూడా రైతులకే దక్కుతోంది. వీరు పండించే పంటల్లో మహిళల పాత్ర కీలకమని చెప్పాలి. ప్రతినెల 30న రైతులంతా సమావేశమై, భవిష్యత్ కార్యచరణ, నిర్ణయాలపై చర్చిస్తారు.
సమీకృత మార్కెట్‌కు సన్నాహం
పసుపు రైతుల ఉద్యమం కూడా ఇక్కడి నుంచే మొదలైంది. గత పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉద్యమం చేసి నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి 180 మంది పోటీ చేయాలనే ఆలోచన లక్ష్మీపూర్‌లోనే పురుడు పోసుకుంది. ఐక్యతతో ముందుకు సాగుతున్న లక్ష్మీపూర్ రైతులు మరిన్ని విజయాలు సాధించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సొంతంగా గ్రామంలోనే సమీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని ఆలోచిస్తున్నారు.