బొజ్జగణపయ్య భక్తుల కోర్కెలు నెరవేర్చే దేవుడే కాదు. చాలామందికి ఉపాధి నిచ్చే ప్రభువు. తమ హస్తకళతో వేలాది విగ్రహాలను తయారు చేసి జీవనం సాగించేవారు ఏటా పెరుగుతూనే ఉన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం విగ్రహాల తయారీకి కేంద్రబిందువు. ఇక్కడ సంవత్సరం పొడవునా విగ్రహాలు తయారుచేస్తూనే ఉంటారు. ఇక్కడ సుమారు 13 విగ్రహ తయారీ కేంద్రాలున్నాయి. ఒక్కో కేంద్రంలో 20 నుంచి 30 మంది బొమ్మల తయారీలో నిమగ్నమై ఉంటారు.
ఏళ్లనాటి అనుభవం
కోరుట్ల పట్టణం సుమారు 35 ఏళ్ల నుంచి విగ్రహాల తయారీలో ఓ ప్రత్యేకత సంతరించుకుంది. ఎలాంటి విగ్రహం కావాలో ముందే చెబితే నచ్చిన రీతిలో ప్రతిమ తయారుచేసి ఇస్తారు. తెలంగాణ జిల్లాలతో పాటు, ఏపీలోని పలు జిల్లాల నుంచి భక్తులు వచ్చి విగ్రహాలు తీసుకెళ్తారు.