Harish Rao warning: సర్కారు దవాఖానాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఒక్క పైసా ఖర్చు లేకుండా 56 రకాల పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యులెవరైనా మందులు బయటకు రాస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జగిత్యాలలో రూ.17 కోట్లతో నిర్మించిన మాతాశిశు కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు అందిస్తున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య తగ్గటంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 56 శాతం ఉంటే జగిత్యాలలో 44 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గించడంలో ముందున్నామని తెలిపారు.
ఒక్క పైసా ఖర్చు లేకుండా 56 రకాల పరీక్షలు చేస్తున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా చేస్తాం. మాతా, శిశు మరణాలను చాలా తగ్గించాం. ఆ విషయంలో తమిళనాడును అధిగమించాం. సర్కారు దవాఖానాలో మందులు లేవనే మాట రాకూడదు. వైద్యులెవరైనా బయటకు మందులు రాస్తే వెంటనే చర్యలు. మన ఆస్పత్రుల్లో అన్ని రకాల మందులు ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరగాలే. అందుకోసం మనందరం కలిసి కృషి చేయాలి.
- హరీశ్ రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి