ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కోసం పెంచుతున్న నర్సరీలు అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల కోసం రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. సుమారు రూ.40లక్షలతో 20 రకాల మొక్కలను పెంచేందుకు నిర్మల్, హైదరాబాద్ నుంచి విత్తనాలను తీసుకొచ్చి నాటారు. డిసెంబర్లో ప్రారంభించిన ఈ నర్సరీల్లో నాటిన విత్తనాలు 35 శాతం మొలకెత్తకపోవడం గమనార్హం.
పర్యవేక్షణ లోపం
మరికొన్ని రోజుల్లో మొక్కలు నాటాల్సి ఉండగా... అధికారుల పర్యవేక్షణలోపం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో అవి సరైన సమయానికి చేతికి రాలేదు. కేవలం 65 శాతం మాత్రమే మొలకెత్తడంతో ఇళ్లలో పెంచే మందార, గులాబీ, మల్లె, గన్నేరు, తులసి మొక్కలను సేకరించారు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో నాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈదురుగాలులతో వర్షం కురవడంతో నర్సరీల్లోని షెడ్ నెట్లు మొక్కలపై పడ్డాయి. వాటిని ఇంతవరకూ తీయకపోవడం గమనార్హం. మొక్కల చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది.