విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఓ చిన్నారి.. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అందించిన సాయంతో ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నాడు. జగిత్యాల జిల్లా రంగారావుపేటకు చెందిన మధు, సుమితరాణి దంపతులకు ఈ నెల 8న మెట్పల్లిలో మగబిడ్డ జన్మించాడు. ప్రసవానంతరం శిశువు పెద్దపేగు మూసుకుపోయిందని.. శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడం వల్ల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు చికిత్సకోసం 5 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు.
కేటీఆర్ చొరవ.. చిన్నారికి శస్త్రచికిత్స - TRS WORKING PRESIDENT KTR
తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చొరవతో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. జగిత్యాల జిల్లా రంగారావుపేటకు చెందిన మధు దంపతుల బాబుకు శస్త్రచికిత్స నిమిత్తం రెండున్నర లక్షల ఆర్థికసాయం అందించారు.
ఏం చేయాలో తెలియని మధు దంపతులు సోషల్ మీడియాలో తమకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. వారి విజ్ఞప్తికి స్పందించిన ది నెస్ట్ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, హైదర్‌నగర్ సభ్యులు, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ ఉద్యోగులు, సురేందర్ ఫౌండేషన్ విరాళాల ద్వారా రెండున్నర లక్షలు సాయం అందించారు. మిగిలిన డబ్బుకోసం డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస రెడ్డిల ద్వారా కేటీఆర్‌ను కలిశారు. ఆయన వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండున్నర లక్షలు విడుదల చేయించి.. ఇతరత్రా ఖర్చులు భరిస్తామని హామీ ఇచ్చారు.
ఐదు లక్షల సాయం అందడం వల్ల ఆస్పత్రి వైద్యులు బాబుకు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో మధు దంపతులు కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇవీ చూడండి : పొరపాట్లకు తావు లేకుండా లెక్కింపు జరగాలి