Korutla Floods 2023 : జగిత్యాల జిల్లాలో ప్రధాన పట్టణమైన కోరుట్లలో చెరువులు, కాలువలు ఆక్రమణకు గురి కావటంతో ఏటా వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లుగా కురుస్తున్నభారీ వర్షానికిస్థానిక మద్దుల చెరువు నీరు రోడ్లు, కాలనీలను ముంచెత్తుతున్నాయి. ఇటీవలి భారీ వర్షానికి రోడ్లపై 5 అడుగుల మేర నీరు ప్రవహించగా సుమారు 150 ఇళ్లు వరద గుప్పిట్లో చిక్కుకున్నాయి. ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంట్లోని సకల సామగ్రి, కార్లు, బైకులు దెబ్బతిన్నాయి. పలు ఇళ్ల ప్రహరీలు కూలిపోగా.. రోడ్లు భారీగా కోతకు గురయ్యాయి. ఏటా ఇదే పరిస్థితి నెలకొంటున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'' ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో టీవీలు, ఫ్రిజ్‌లు, మొత్తం సామాన్లు పాడైపోయాయి. పాములు, తేళ్లు వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడల్లా వరదలతో ఇండ్లు మునిగిపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇదే సమస్యలు వస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదు. మాకు అధికారులు శ్వాశత పరిష్కారం చూపాలని కోరుతున్నాం.-స్థానికులు
Flood problems in Korutla :మద్దుల చెరువు- మినీ ట్యాంక్‌బండ్ మత్తడి కింద సుమారు 16 అడుగుల వెడల్పుతో కాలువలు గతంలో నిర్మించారు. ఇరువైపులా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించటంతో కాలువ 3అడుగులకు కుచించుకపోయింది. రవీంద్ర రోడ్‌లోని తాళ్ల చెరువు పూర్తిగా నిండిన తర్వాత వరద నీరు బయటికి వెళ్లేందుకు 10నుంచి 14 అడుగుల మేర కాలువ ఉండేది. సుమారు 17 ఏళ‌్ల కింద కాలువను పూర్తిగా పూడ్చి సిమెంట్ రోడ్డుగా మార్చారు. పలు చోట్ల కాలువను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో మత్తడి కిందున్న కాలువ ఆనవాళ్లు లేకుండా పోయాయి. దీంతో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తూ కాలనీలు జలమయం అవుతున్నాయి. దీంతో తమకి దిక్కుతోచని పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.