లాక్డౌన్ సమయంలో రైతులు పండించిన పంటను మేమే కొంటామని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ తాజా పరిస్థితులు ఆ విషయంలో విఫలమైందనే చెప్తున్నాయి. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ.. పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఏప్రిల్ 15న మహిళా సంఘం ఆధ్వర్యంలో ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని అమ్మడానికి కొనుగోలు కేంద్రాలకు తరలించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించిన అధికారులు తేమ అధికంగా ఉందని.. పదిహేను రోజుల తర్వాత కొంటామని చెప్పారు. అప్పటి నుంచి రైతులు రోజు ధాన్యం ఎండకు ఎండబెడుతూ.. తిరిగి సాయంత్రం వేళలో కుప్పలు చేసి పాలిథిన్ కవర్లు కప్పుతూ కాపాడుతున్నారు.
రెండు నెలలుగా రైతులు రోజూ ధాన్యం ఎండబెట్టడం.. సాయంత్రి తిరిగి కుప్ప నూర్చి కవర్లతో కప్పి ఉంచడం నిత్యకృత్యంగా మారిపోయింది. రెండు నెలలుగా.. ధాన్యంలో ఇంకా తేమ అలాగే ఉందా.. ధాన్యం కొనడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారని రైతులు అడిగినా సమాధానం లేదు. ఇప్పటి వరకు ఐలాపూర్ ఐకేపీ కేంద్రంలో 17వేల క్వింటాళ్ల ధాన్యం కొని.. 68 లారీల ద్వారా మిల్లులకు తరలించారు.
ఇంకా 4వేల క్వింటాళ్ల ధాన్యం తరలించడానికి సిద్ధంగా ఉంది. కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మాత్రం లారీలు అందుబాటులో లేవని చెప్తున్నారు. గత వారం, పదిహేను రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కుప్పలు చేసిన ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెలలు, రోజుల తరబడి ధాన్యం బస్తాల్లో నిల్వ చేస్తుంటే.. వర్షానికి తడిసి సంచులు చిరిగిపోవడం, చెదలు పట్టడం, ధాన్యం బస్తాల్లోనే మొలకెత్తుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తాము పండించిన ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా