జగిత్యాల జిల్లాలో కొవిడ్ మహమ్మారి కోరలు చాస్తోంది. రోజు వందల సంఖ్యల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. పలు ప్రాంతాల్లో అర్చకులు కొవిడ్‌తో మృత్యువాత పడుతున్నారు. వారం వ్యవధిలోనే ఐదుగురు పూజారులు బలయ్యారు.
అర్చకులపై కొవిడ్ పంజా.. వారం వ్యవధిలో అయిదుగురు మృతి... - జగిత్యాల కొవిడ్ వార్తలు
భగవంతునికి భక్తులకు మధ్య వారధిగా ఉండే అర్చకులపై కొవిడ్ మహమ్మారి ప్రభావం చూపుతోంది. జగిత్యాల జిల్లాలోని పలు మండలాల్లో వారం రోజుల్లో అయిదుగురు పూజారులు కొవిడ్ మహమ్మారికి బలవ్వడం తీవ్ర విషాదం నింపింది.
బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పని చేసే పూజారి రామయ్య పంతులు ఈనెల 4న కొవిడ్‌తో మృతి చెందారు. ఆయన కుమారుడు లక్ష్మణాచార్యులు కొవిడ్‌తోనే ఊపిరి వదిలారు. ఒకే కుటుంబంలో తండ్రి, కుమారుల మృతితో ఆ కుటుంబం శోకసంద్రంలో మనిగిపోయింది. రాయికల్ మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయంలో పనిచేస్తున్న శ్రీనివాసశర్మ ఈనెల 4న మరణించగా... ఆయన సోదరుడు హనుమాన్ శర్మ ఇవాళ తుదిశ్వాస విడిచారు. హనుమాన్ శర్మ సోదరుని కుమారుడు శరత్ శర్మ కూడా ఈ వారంలోనే మృతి చెందాడు. రోజురోజుకు మృతుల సంఖ్య పెరగడం వల్ల అర్చకులు భయటకు రావడానికి జంకుతున్నారు. వివాహాది శుభకార్యాలు జరిపించేందుకు వెనకడుగు వేస్తున్నారు.