Farmers protest against master plan: జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేయాలని కోరుతూ జగిత్యాల ప్రభావిత గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రహదారిలో హుస్నాబాద్ వద్ద అంబారిపేట, హుస్నాబాద్ రైతులు ఆందోళన చేపట్టగా.. మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ అంబారిపేట రైతులు గ్రామ పంచాయతీ భవనంపై ఎక్కి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వరకూ వెళ్లారు.
మిగతా గ్రామాల్లో కూడా రైతన్నలు మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి పదవులకు రాజీనామా చేయగా.. ఈ ముసాయిదాను రద్దు చేసేవరకూ ఎంతవరకైనా పోరాడతమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి అన్నదాతలతో తగు చర్చలు జరిపి పరిస్థితి చేయిదాటకుండా చూడాలని కొందరు అభిప్రాయ పడుతున్నారు. ప్రభుత్వం తమ పంథా మార్చుకోకుంటే కామారెడ్డి తరహాలో ఆందోళనలు ఉద్దృతం చేస్తామని రైతులు తెలిపారు.
ఏంటి ఈ మాస్టర్ ప్లాన్ వివాదం: 2041 వరకు పట్టణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బృహత్తర ప్రణాళికకు ముసాయిదా విడుదల చేసింది. మాస్టర్ ప్లాన్‌లో రాబోయే 20 ఏళ్లలో చేపట్టబోయే రోడ్ల విస్తరణ, పారిశ్రామిక, వాణిజ్య, పబ్లిక్, సెమీ పబ్లిక్, పార్క్, ప్లేగ్రౌండ్స్ తదితర జోన్లను ప్రతిపాదించారు. కొత్త మాస్టర్‌ప్లాన్‌లో విస్తీర్ణాన్ని 6084 హెక్టార్లుగా ప్రతిపాదించారు. 823 హెక్టార్లు పట్టణ ప్రాంతాన్ని, 216 హెక్టార్లు రహదారుల విస్తరణ, 209 హెక్టార్లు కొత్త రోడ్ల నిర్మాణం, 324 హెక్టార్లు ఉద్యాన, వినోద పార్కులు, 309 హెక్టార్లు వాణిజ్య జోన్, 2423 హెక్టార్లు నివాసిత ప్రాంతం, 238 హెక్టార్లు అటవీ ప్రాంతం, 546 హెక్టార్లు చెరువులు, 372 హెక్టార్లను గుట్టలుగా ప్రతిపాదించారు.