farmers protest news: వరి రైతుల గోస తీరడంలేదు. మరికొన్నిరోజుల్లో కొంటారంటూ కళ్లల్లో వత్తులు వేసుకొని చూస్తున్నా... రైతులకు పడిగాపులు తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాల్లో వడ్లతో రోజులకొద్దీ నిరీక్షిస్తున్నారు. తేమ శాతం పేరుచెప్పి ధాన్యం కొనకపోవడం.. ఒకవేళ కొన్నా భారీగా కోత విధించంటం.. ఈ మధ్యలో రైస్‌మిల్లర్ల మోసాలు.. రైతుల పాలిట శాపంగా మారాయి. ధాన్యం కొనుగోలు తొందరగా జరిపి రైస్‌మిల్లర్ల మోసాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు పలు చోట్ల ఆందోళన బాట పట్టారు.
farmers protest in jagtial: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన రైతులు మెట్‌పల్లిలోని సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి తేమశాతంను అడ్డం పెట్టుకొని మిల్లర్లు ధాన్యంలో భారీగా కోత విధిస్తూ నష్టాల పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ.. మంత్రులు గానీ పట్టించుకోవడం లేదంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కనీస పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని గోడు వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని ధాన్యం కొనుగోళ్లు తొందరగా పూర్తి చేసి తమను కాపాడాలని రైతులు డిమాండ్ చేశారు.