రాష్ట్ర ప్రభుత్వం ఎకరాకు రూ.5వేలు పెట్టుబడి సాయం అందిస్తుండగా కార్యచరణ లేమితో కర్షకులకు చేరడంలేదు. జిల్లాలో రూ.171 కోట్లు రైతుల ఖాతాలో జమ కావాల్సి ఉండగా చేరింది మాత్రం రూ.100 కోట్లు మాత్రమే. 98 వేల మందికి మాత్రమే నగదు చేరగా 63 వేల మందికి నగదు రాకపోగా ఏటీయంలను తరచిచూస్తున్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, గంగాధర, మానకొండూర్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మండలాల్లో వేలసంఖ్యలో రైతులకు సాయం చేరకపోవడం వల్ల వ్యవసాయ అధికారులను ఆశ్రయిస్తున్నారు.
వర్షాల లేమి.. అంతటా లోటే
ఎన్నడూ లేనివిధంగా ఈ ఖరీఫ్ సీజన్ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్‌లో వానలు అంతంతమాత్రమే కాగా ఈ నెలలో 12 రోజులు గడువగా చిన్న కుంట కూడా నిండింది లేదు. నార్లు పోసిన రైతన్న నాట్లు వేసేందుకు నీరు లేక వర్షమో రామచంద్రా.. అంటూ అర్రులు చాస్తున్నారు. ప్రాజెక్టుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అడపదడపా కురుస్తున్న వర్షం పత్తి, మొక్కజొన్న పంటలకు కొంతలో కొంత ఉపశమనం కలిగిస్తుండగా చెరువు నిండింది లేదు.. నీటి గోస తీరింది లేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం 40శాతమే పంటలు సాగవడం వర్షలేమిని చాటుతోంది. రామడుగు, కరీంనగర్ రూరల్, మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీణవంక, హుజూరాబాద్, జమ్మికుంట మండలాల్లో ఇంకా లోటు వర్షపాతమే.
తేలని రుణమాఫీ.. అందని రుణం
రుణమాఫీ చేయాలని నిర్దేశించిన ప్రభుత్వం ఆచరణలో అడుగు వేయకపోవడం వల్ల కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు కొర్రీలు పెడుతున్నారు. జిల్లావ్యాప్తంగా రూ.500 కోట్ల వరకు రుణమాఫీ కావాల్సి ఉండగా ఎటూ తేలడం లేదు. వార్షిక రుణ ప్రణాళిక ఇటీవల ఖరారు కాగా కొత్త రైతులకు రుణాలివ్వడం లేదు. మొన్నటివరకు రుణ ప్రణాళిక ఖరారు కాలేదని సాకులు చెప్పి ఇప్పుడు ధరణి వెబ్‌సైట్ ప్రారంభమయ్యాక.. అంటూ దాటవేస్తున్నారు.