నడిరోడ్డుపై ఓ వృద్ధురాలిని మంచంపై ఉంచి ముగ్గురు మోసుకుపోతున్నారు. చూసిన వారంతా.. ఎవరో మృతి చెంది ఉంటారు. కరోనా సమయం వల్ల అంతిమ యాత్రకు ఎవ్వరూ రాలేదు అనుకున్నారు. ఇంతలో మంచంపై ఉన్న ముసలమ్మ కదులుతుంది. అరె బతికుండగానే ఇదేమి దుస్థితి అనుకున్నారు. అప్పుడు ఆరా తీస్తే తెలిసింది అసలు సంగతి.
బతికుండగానే మోసుకెళ్లాల్సిన పరిస్థితి... - వృద్ధురాలిని మంచంపై ఉంచి మోసుకెళ్లిన బంధువులు
కన్నోళ్లకు కొవిడ్ వచ్చిందని.. కడుపున పుట్టినవాళ్లు... ఇంటికి తీసుకెళ్లేందుకు సంకోచించారు. వారిని ఏ ఆటో డ్రైవర్ తమ వాహనంలో ఎక్కించుకోలేదు. ఏమి చేయాలో తెలియని స్థితిలో మంచంపై ఉంచి ఇంటికి తీసుకెళ్లి పశువుల కొట్టాంలో పెట్టారు. కొవిడ్ కష్టాలను కళ్లకు కట్టినట్టు చూపిన ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో జరిగింది.
జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన 90 ఏళ్ల వృద్ధుడు, 85 ఏళ్ల అతని భార్యకు కొవిడ్ సోకింది. దంపతులిద్దరూ కొవిడ్ లక్షణాలు ఉండడం వల్ల ఆటోలో ఆరోగ్య కేంద్రానికెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలియగానే వారిని ఎక్కించుకునేందుకు ఏ ఆటో డ్రైవర్ ముందుకు రాలేదు. వారి ముగ్గురు కుమారులు.. తల్లిదండ్రులను తీసుకెళ్లేందుకు వెనకడుగు వేశారు. చేసేదేమీ లేక ఓ మంచం తీసుకొచ్చి దానిపైనే తల్లిని పడుకోబెడ్డి రోడ్డంట మోసుకుని తీసుకుపోయి పశువుల పాకలో పెట్టారు. కొవిడ్ రోగుల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిన ఈ దృశ్యం చూసిన వారంతా అయ్యో..! పాపం అనుకోవడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి.
ఇదీ చూడండి:రాష్ట్రంలో కొత్తగా 7,430 కరోనా కేసులు... 56 మంది మృతి