జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో పరిధిలో మొత్తం 58 బస్సులు ఉండగా.. నిత్యం 26 రూట్లలో 24 వేల కిలోమీటర్ల వరకు బస్సులు తిప్పుతున్నారు. గతంలో ఈ డిపోకి రోజుకు రూ.8 లక్షల ఆదాయం వచ్చేది. లాక్డౌన్ తర్వాత ఆర్టీసీ ఆదాయం పూర్తిగా తగ్గింది. దీంతో డిపో ఆదాయం పెంచేందుకు ఉద్యోగులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఈటీవీ భారత్తో గోడు వెళ్లబోసుకున్నారు. గతంలో 15 గంటల వరకు డ్యూటీ చేస్తే.. మర్నాడు స్పెషల్ ఆఫ్ కింద విశ్రాంతి కోసం సెలవు ఇచ్చేవారని... ప్రస్తుతం ఆ వెసులుబాటు తొలగించి, అదనపు ఆదాయం కోసం విధులు నిర్వహించేలా ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
'అదనపు ఆదాయం కోసం ఉద్యోగులపై ఒత్తిడి'
లాక్డౌన్ కారణంగా ఆర్టీసీకి నష్టాలు వాటిల్లడం వల్ల ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు నడిచినా... రోజు వారి ఆదాయం తగ్గుతోంది. దీంతో ఆదాయం తీసుకొచ్చేలా ఉద్యోగులపై అదనపు భారం వేస్తూ... ఇతర మార్గాలను వెతుక్కుంటుంది ఇక్కడి ఆర్టీసీ డిపో యాజమాన్యం.
వారంలో ఆరు రోజులపాటు డ్యూటీ చేయడం వల్ల విశ్రాంతి లేక... అనారోగ్యం పాలవుతున్నామని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. డిపో ఆదాయం పెంచి ఉన్నతాధికారుల మెప్పు పొందేందుకు డ్యూటీలు వేస్తూ... ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఎక్కడా లేని నిబంధనలు మెట్పల్లిలో అమలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఆర్టీసీ బస్సులు మరమ్మతులకు గురయ్యాయని, సరిగా పనిముట్లు కూడా లేవంటున్నారు. ఒత్తిడి లేకుండా విధులు అప్పగిస్తే... ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తామని చెబుతున్నారు. పని ఒత్తిడి ఉద్యోగులు అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి:భూ తగాదాలు: గొడ్డలితో నరికి చంపారు!